అమెరికాలో తెలుగు యువకుడు మృతి

హైదరాబాద్‍లోని మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని జలపాతంలో జారిపడి మృతి చెందాడు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అత్తలూరు గ్రామానికి చెందిన మాదినేని వెంకట శ్రీనివాసరావు, రమాదేవి ఉద్యోగ రీత్యా అత్తలూరు నుంచి కర్నూలుకు అక్కడి నుంచి హైదరాబాద్‍కు వచ్చి సెటిల్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ అధికారిగా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన శ్రీనివాసరావుకు కుమారుడు ప్రవీణ్‍కుమార్(31), కుమార్తె ఉన్నారు. ప్రవీణ్ కుమార్ ఎంఎస్సీ చదివేందుకు ఎనిమిదేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడే అమెజాన్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.
వర్జీనియాలో ఓ ఇంటిని కొనుగోలు చేసి త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆస్టిన్‍లోని జలపాతం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహం హైదరాబాద్ తీసుకువచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.