హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అంతా ఆన్లైన్లోనే..
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న హెచ్1బీ వీసాదారులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీసా క్యాప్‌లు తదితర అంశాల కారణంగా ఇకపై వీళ్లెవరూ ఇబ్బంది పడకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తామని తెలిపింది. ఇకపై హెచ్1బీ వీసాదారులు తమ వీసా గడువును ఆన్లైన్లోనే పొడిగించుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీని కోసం త్వరలోనే పైలట్ ప్రాజెక్టు లాంచ్ చేస్తామని బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్‌లో వీసా సేవల విభాగంలో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న జూలీ స్టఫ్ట్ వివరించారు. ‘కరోనా సమయంలో వీళ్లంతా తమ తమ స్వదేశాలకు వెళ్లడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అందరం చూశాం. మళ్లీ ఇక్కడకు తిరిగి రావడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో కూడా మనకు తెలుసు. ఈ సమస్యను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు. ఈ ప్రక్రియ ఆన్లైన్లో జరగడం వల్ల ప్రభుత్వ ఆఫీసులపై కూడా భారం తగ్గుతుందని వివరించారు. ఈ నిర్ణయం వల్ల హెచ్1బీ వీసాదారులకు చాలా లబ్ది చేకూరుతుంది. ఎక్కువగా టెక్ రంగంలోని వాళ్లు ఈ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారు. వీరిలో కూడా భారతీయులే ఎక్కవ మంది ఉండటం గమనార్హం. దీంతో ఈ నిర్ణయంపై వీళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.













