అంగరంగ వైభవంగా 18వ కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం
18వ కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హోమ్ వేదికగా ప్రారంభమయ్యాయి. అలెగ్జాండర్ స్టేడియంలో కన్నుల పండువగా జరిగిన ప్రారంభ వేడుకల్లో బ్రిటన్ సంప్రదాయ కళారీతులు ఆహుతులును కట్టిపడేశాయి. అందరి కంటే ముందు మైదానంలోకి క్రీడల మస్కట్ పెర్రీ ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత సంప్రదాయ నృత్యాలతో స్టేడియం మార్మోగిపోయింది. ప్రముఖ కంపెనీలకు చెందిన 72 కార్లు దూసుకురాగా వాటి వెనకే బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ వేదికపై వచ్చారు. అనంతరం ఆధునిక సాంకేతికతను ఉపయోగించిన నిర్వహించిన షో చూపరులను ఆకట్టుకోగా నోబల్ ప్రైజ్ విజేత మలాలా యూసుఫ్‌జాహి కామన్వెల్త్ క్రీడల గొప్పతనాన్ని వివరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామన్వెల్త్ దేశాలన్నింట్లో ప్రతి చిన్నారి పాఠశాలలకు వెళ్లాలని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలని ఆకాంక్షిస్తూ అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.













