అమెరికా ఎన్నికల బరిలో ఏఐ డీప్‌ఫేక్స్ హల్చల్.. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల సరికొత్త ఎత్తుగడ
అమెరికాలో నవంబర్ 3న జరగనున్న కీలక మధ్యంతర ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన ప్రచార ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు, నాయకులు తమ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు వ్యంగ్యం, పేరడీ పేరిట ఏఐ డీప్‌ఫేక్ యాడ్స్‌ను భారీగా రంగంలోకి దించుతున్నారు.
న్యూయార్క్‌లో మొదలైన ప్రకటనల దుమారం
న్యూయార్క్ గవర్నర్‌గా పోటీ చేస్తున్న రిపబ్లికన్ నేత బ్రూస్ బ్లేక్‌మాన్ విడుదల చేసిన ప్రచార ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మాండాని , ప్రస్తుత గవర్నర్ కాథీ హోచుల్ ఇద్దరూ కలిసి స్థానిక ప్రజలపై భారం మోపేలా ధరలు, టోల్ ఛార్జీలు, సబ్వే ఛార్జీలను పెంచడానికి పని చేస్తున్నట్లు చూపించే వీడియోలను రూపొందించారు. అయితే ఆ వీడియోల్లో ఉన్నది అసలైన నేతలు కారని, పూర్తిగా ఏఐతో సృష్టించిన డీప్‌ఫేక్ దృశ్యాలని వెల్లడైంది. ప్రారంభంలో డిస్క్లైమర్లు ఇచ్చామని, రాజకీయాల్లో పేరడీ , వ్యంగ్యం సహజమేనని బ్లేక్‌మాన్ సమర్థించుకున్నారు. అయితే డెమొక్రాటిక్ పార్టీ మాత్రం ఇది నిబంధనల ఉల్లంఘన అని, ఓటర్లను తప్పుదోవ పట్టించడమేనని ఎన్నికల బోర్డుకు ఫిర్యాదు చేసింది.
80 మిలియన్ డాలర్ల ఖర్చుతో ‘స్లోపాగండా’ వెల్లువ
ఈ ప్రచార సీజన్లో అభ్యర్థులు, వారి మద్దతుదారులు 164కు పైగా ఏఐ ప్రకటనల కోసం సుమారు 80 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు వెస్లియన్ మీడియా ప్రాజెక్ట్ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో దాదాపు 80 శాతం యాడ్స్ రిపబ్లికన్ వర్గాల నుంచే వచ్చాయి. న్యూయార్క్ యూనివర్సిటీ టెక్నాలజీ పాలసీ సెంటర్ డైరెక్టర్ స్కాట్ బాబ్వా బ్రెన్నెన్ ఈ పరిస్థితిని స్లోపాగండా(నాసిరకం ఏఐ స్లోప్ + ప్రొపగాండా) అని అభివర్ణించారు. ఇలాంటి ప్రకటనలు ఓటర్లలో ప్రత్యర్థి నేతల వ్యక్తిత్వం , సిద్ధాంతాలపై అనుమానాలు రేకెత్తించి, వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని ఆయన హెచ్చరించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటనలు
ఒహియో సెనేట్ డెమొక్రాటిక్ అభ్యర్థి షెర్రోడ్ బ్రౌన్‌ను ఆహ్వానం లేకున్నా పార్టీలో మిగిలిపోయిన చివరి అతిథిగా, టెక్సాస్ డెమొక్రాటిక్ అభ్యర్థి జేమ్స్ టాలరికోను ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమాలోని మరియా పాత్ర వేషధారణలో చూపించారు. మిచిగాన్ రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోగర్స్‌ను ఏకంగా ఒక సూపర్ హీరోగా ప్రదర్శించారు.
సాన్ ఫ్రాన్సిస్కోలో చాట్‌బాట్ వివాదం
హౌస్ స్పీకర్ ఎమిరటస్ నాన్సీ పెలోసి స్థానంలో పోటీ పడుతున్న కాలిఫోర్నియా డెమొక్రాటిక్ సెనేటర్ స్కాట్ వీనర్ ఏఐ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టి తీవ్ర విమర్శల పాలయ్యారు. తన ప్రత్యర్థి కానీ చాన్ మాట్లాడే శైలి, ఉచ్చారణ, పౌరసత్వాన్ని కించపరిచేలా ఈ చాట్‌బాట్ సమాధానాలు ఇవ్వడంతో దానిని జాత్యహంకార చర్యగా తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో వీనర్ ఆ చాట్‌బాట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ చర్య ఓటర్లకు అభ్యర్థి నిర్ణయ సామర్థ్యంపై తప్పుడు సంకేతాలు ఇచ్చిందని స్టార్లింగ్ ల్యాబ్ ప్రతినిధి ఆడమ్ రోస్ పేర్కొన్నారు.
ఫెడరల్ నిబంధనల అవసరం
ప్రస్తుతం అమెరికాలో ఏఐ డీప్‌ఫేక్ ప్రకటనలను నియంత్రించేందుకు ఎలాంటి పటిష్టమైన ఫెడరల్ చట్టం లేదు. అయినప్పటికీ, సుమారు 31 రాష్ట్రాలు ఈ తరహా ప్రకటనలను గుర్తించి నియంత్రించేందుకు తమ స్వంత చట్టాలను తీసుకువచ్చాయి. వాషింగ్టన్ డీసీలోని పబ్లిక్ సిటిజన్ సంస్థ ప్రతినిధి ఇలానా బెల్లర్ మాట్లాడుతూ, ఆహార పదార్థాలపై లేబుల్స్ ఉన్నట్లే, ఏఐ కంటెంట్‌ను కూడా ఓటర్లు సులభంగా గుర్తించేలా స్పష్టమైన లేబులింగ్ ఉండాలని, జాతీయ స్థాయిలో ఫెడరల్ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, వృద్ధ ఓటర్లకు ఏఐ డీప్‌ఫేక్స్ గురించి అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.








