మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ : కేంద్రం సంచలన నిర్ణయం

వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం సంచలన ప్రకటన చేసింది. అలాగే మే 1 నుంచి వ్యాక్సినేషన్ మూడో దశను కూడా ప్రారంభిస్తామని తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తున్న సమయంలో కేంద్రం ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో వ్యాక్సిన్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించడం గమనార్హం. మరోవైపు దేశంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీ చాలా సుదీర్ఘంగానే సాగింది. ఈ భేటీ ముగియగానే ప్రధాని మోదీ దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన వైద్య బృందంతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగియగానే ఇంతటి కీలక నిర్ణయం వెలువడింది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియే అతి పెద్ద ఆయుధమని మోదీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ తీసుకునేలా వైద్యులందరూ ప్రజల్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌పై వచ్చిన పుకార్లకు వ్యతిరేకంగా డాక్టర్లందరూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. కరోనా లాంటి సంక్లిష్ట సమయంలో ప్రజలకు సేవలందిస్తున్న వైద్య బృందాన్ని మోదీ అభినందించారు.