కొత్తగా వ్యాక్సిన్ జాతీయవాదం? విచిత్ర ప్రమాదంలో ప్రపంచ దేశాలు
వాషింగ్టన్ః కరోనా వైరస్‌ను నిరోధించడానికి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న సంపన్న దేశాలు తమ అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు పంపిణీ చేస్తామనే వాదన ప్రారంభించడంతో వ్యాక్సిన్ పంపిణీలో తీవ్రమైన అసమానతలు, అసమతూకాలు తలెత్తుతున్నాయి. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నాటికి ప్రతి వయోజనుడికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో ఇది అనేక దేశాలకు ఇబ్బందికరంగా మారింది.
అనేక సంపన్న దేశాలలోని ప్రభుత్వాలు తమ ప్రజలకు ముందుగా వ్యాక్సిన్ వేయడానికి కంకణం కట్టుకుంటుండడంతో, ఇతర దేశాలు తమ సంగతి తాము చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంపన్న దేశాల ‘వ్యాక్సిన్ జాతీయవాదం’, ఔషధ పరిశ్రమల అత్యాశ, సరైన సమాచారం లేకపోవడం, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కుప్పకూలిపోవడం వగైరాలు ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాక్సిన్ అందడంలో ఆటంకాలు, అవరోధాలుగా మారాయి.
అమెరికాతో సహా సుమారు 100 దేశాలు ప్రస్తుతం తమ ప్రజలకు వ్యాక్సిన్‌ను వేయగలుగుతున్నాయి. ఇవి రోజుకు 40 లక్షల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నట్టు అంచనా. అమెరికాలో అయితే గత వారాంతంలో 45 లక్షల మందికి కూడా వేయడం జరిగింది. కాగా, ఫిబ్రవరి నాటికి పది సంపన్న దేశాలు 75 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశాయి. అయితే, ఆఫ్రికాతో సహా 30 దేశాలు ఇంకా వ్యాక్సిన్ వేయడమే ప్రారంభించలేదు.
ప్రస్తుత వ్యాక్సినేషన్ రేటును బట్టి చూస్తే, ప్రపంచ దేశాలు రెండు వ్యాక్సిన్ డోసులూ పూర్తి చేయడానికి 4.6 సంవత్సరాల కాలం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాదాయ దేశాలలో 80 శాతం ప్రజలు ఈ ఏడాది ఒక్క డోసు కూడా వేసుకునే అవకాశం లేదని కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది.
సంపన్న దేశాలకే పరిమితం
ఈ ఏడాది వెయ్యి నుంచి 1,400 కోట్ల వ్యాక్సిన్ డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలమని ఔషధ సంస్థలు చెబుతున్నాయి. సంపన్న దేశాలన్నీ ఇప్పటికే ఈ వ్యాక్సిన్ డోసుల కోసం ఒప్పందాలు కుదర్చుకున్నాయి. మొత్తం ఉత్పత్తిలో మూడవ వంతు ఈ దేశాల వినియోగానికి కేటాయించడం తప్పనిసరి. ఈ ఉత్పత్తితో సంపన్న దేశాలు తమ ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను చాలావరకు పూర్తి చేసుకోగలుగుతాయి.
ఇంతకూ ఈ సంపన్న దేశాలన్నీ తమ జనాభాకు వ్యాక్సిన్ వేయడానికే, అంటే తమ అవసరాలు తీరడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ దేశాలు ఇలా తమ వ్యాక్సిన్ నిల్వలను భద్రపరచుకుంటుండడంతో ఇతర దేశాలు తమ సంగతి తాము చూసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో, ముఖ్యంగా వర్ధమాన, పేద దేశాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోని అసమానతలు ఇదివరకటి కంటే ఎక్కువగా ప్రజానీకం మీద తమ దుష్ప్రభావాన్ని చూపెడుతున్నాయి.
వ్యాక్సిన్ పంపిణీలో చోటు చేసుకుంటున్న అసమానతల వల్ల, ప్రపంచ దేశాలన్నిటి మీదా ఆర్థిక, సామాజిక దుష్పరిమాణాలు, దుష్ప్రభావాలు పడే ప్రమాదముంటుందని ఆర్థిక, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, దీని ప్రభావం అమెరికా మీద కూడా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్త వ్యాక్సినేషన్ జరగని పక్షంలో అమెరికాతో సహా ఏ దేశంలోనూ ఈ వైరస్ అంతం కాదని, ఆర్థిక వ్యవస్థలు మళ్లీ బలం పుంజుకోవడం కూడా సాధ్యం కాదని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ ఎలెన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు శక్తిమంతం కానట్టయితే, సుమారు 25 కోట్ల మంది ప్రజలు అతి భయానకమైన పేదరికంలోకి దిగజారిపోవడం ఖాయమని కూడా ఆయన హెచ్చరించారు.
వ్యాక్సినేషన్‌ను పెంచడంతో పాటు, అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవడం అనివార్యమని, ఇటువంటి చర్యలు తీసుకోని పక్షంలో, ఈ వైరస్ సంక్షోభం శాశ్వతంగా తిష్ఠ వేయడం జరుగుతుందని గత ఫిబ్రవరిలో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటొని ఫాసీ కూడా హెచ్చరించడం జరిగింది. ఒక వేళ అమెరికా తన ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని పూర్తి చేసినప్పటికీ, ఇతర దేశాల నుంచి కొత్త రూపాలలో కోవిడ్ ప్రారంభమై అమెరికాకు వ్యాపించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త రూపాలలో వచ్చే కోవిడ్ వల్ల మళ్లీ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా వ్యవస్థలు కుప్పకూలడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఎవరికి వారే యమునా తీరే
‘‘మన ఒక్క దేశం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తే సరిపోదు. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకుంటేనే అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మనం చౌకగా, తేలికగా పంపిణీ చేయగల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం మీద అంతా ఆధారపడి ఉంది’’ అని ఆయన అన్నారు.
ఇది ఇలా ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయ సహకారాలతో ‘కోవాక్స్’ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, పంపిణీ చేస్తున్నప్పటికీ, వ్యాక్సినేషన్ సంబంధమైన అసమానతలు మాత్రం వైదొలగడం లేదు. వర్ధమాన, పేద దేశాల కోసం సరసమైన ధరలకు ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. కోవాక్స్ ఉత్పత్తికి మొదటి నుంచి ఆర్థిక వనరుల కొరత ఆటంకాలు సృష్టిస్తోంది.
నిజానికి ఏ దేశం కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్నా లేక దిగుమతి చేసుకోవాలన్నా ఆర్థిక వనరుల కొరత పెద్ద అవరోధంగా తయారైంది. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్న పక్షంలో తప్పనిసరిగా సంపన్న దేశాలే చేయూతనందించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ జరగాలంటే 2022 నాటికి 5,000 కోట్ల డాలర్ల నిధులు అవసరం. కాగా, అమెరికాతో సహా వివిధ దేశాల ప్రభుత్వాల దగ్గర నిధులున్నా అవి ఇచ్చే ఉద్దేశంలో లేవు. వైరస్ నిరోధానికి అమెరికా 5 ట్రిలియన్ డాలర్ల మేరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది కానీ, ఇతర దేశాలను ఎంత వరకూ ఆదుకుంటుందన్నది తెలియడం లేదు.
కోవాక్స్ ను ఉత్పత్తి చేయడానికి తాము నిధులు ఇచ్చేది లేదని గతంలో ట్రంప్ ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేసింది. అయితే, ఇందుకు అమెరికా 400 కోట్ల డాలర్లు సహాయం చేస్తుందని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఉత్పత్తి చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకే కాక, దీన్ని ఉత్పత్తి చేయడానికి అన్ని రకాల సౌకర్యాలూ కలిగి ఉన్న భారతదేశానికి కూడా సహాయం చేయడానికి బైడెన్ ప్రభుత్వం అంగీకరించింది. భారతదేశం 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయడానికి నిర్ణయించుకుంది.
వర్థమాన, పేద దేశాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని చైనా ప్రయత్నిస్తుండడంతో దానికి పోటీగా అమెరికా ఈ రకమైన సహాయాలు అందజేయడానికి నడుం బిగించింది. అమెరికా తన ప్రజలకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసిన తర్వాత, ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని భావిస్తోంది.







