అన్ని దేశాలు చేతులు కలపాల్సిందే! కరోనా అంతానికి అంతర్జాతీయ సహకారం అవసరం

వాషింగ్టన్‍ః ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటి మీద నిలబడి, చేయి చేయి కలిపితే తప్ప కరోనా వైరస్ పూర్తిగా నిష్క్రమించదని భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు, అమెరికా 21వ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. కరోనాపై పోరాటంలో అమెరికా వివిధ దేశాలను ఎలా కూడగట్టుకుని పోతున్నదీ ఆయన వివరిస్తూ, రెండవ విడత కరోనా విజృంభణతో కేసులు విపరీతంగా పెరిగి అతలాకుతలం అవుతున్న భారత్‍కు అమెరికా ఏ విధంగా సహాయం అందిస్తున్నదీ ఆయన తెలియజేశారు.
‘‘భారత్‍లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో భారత్‍ను ఆదుకోవడానికి, అండగా నిలవడానికి అమెరికా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. నిజానికి అనేక దేశాలలో ఇటువంటి పరిస్థితే నెలకొని ఉంది. ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకుంటే తప్ప ఈ వైరస్‍కు సమాధి కట్టలేం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇతర దేశాలకు సహాయ సహకారాలు అందించడానికి, కరోనాపై పోరాటంలో అన్ని దేశాలనూ కలుపుకునిపోవడానికి అమెరికా అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ రోజు కూడా అనేక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‍తో ఫోన్‍లో మాట్లాడుతూ, భారతదేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా విజృంభించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సలీవాన్, దోవల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి వివేక్ మూర్తి తన ట్వీట్‍లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, భారత్‍లో రెండవ విడత సందర్భంగా కేసులు బాగా పెరగడం అమెరికాకే కాక, అంతర్జాతీయంగా కూడా ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
భారత్‍కు ఆపన్న హస్తం
‘‘ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ఈ రోజు కొన్ని పటిష్ఠమైన నిర్ణయాలు తీసుకొంది. ఏ ఒక్క దేశంలో కేసులు పెరిగినా దాని ప్రభావం అన్ని దేశాల మీదా ఉంటుంది’’ అని వివేక్ మూర్తి పేర్కొన్నారు. ఒక వైపు కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సా సౌకర్యాలు అందించడంతో పాటు, వైద్య, ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించడం కోసం ఔషధ సామగ్రి, పరీక్షా పరికరాలు, పి.పి.ఇలు, వెంటిలేటర్లు వగైరాలను అందించడం కోసం అమెరికా నడుం బిగించిందని ఆయన తెలియజేశారు. ఆక్సిజన్ తయారీ యంత్రాలను కూడా భారత్‍కు పెద్ద ఎత్తున సరఫరా చేయడానికి అమెరికా చర్యలు తీసుకొంటోందని ఆయన తెలిపారు.
భారత్‍లో వ్యాక్సిన్‍ను, ఇతర కరోనా చికిత్సా ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న బయోఇ తదితర ఔషధ ఉత్పత్తి సంస్థలకు అవి మరింత ఎక్కువగా వ్యాక్సిన్‍ను, ఔషధాలను ఉత్పత్తి చేయడానికి వీలుగా అమెరికా డెవలప్‍మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డి.ఎఫ్.సి) భారీగా నిధులు అందజేస్తోందని అంటూ ఆయన, 2022 చివరి నాటికి ఇవి వంద కోట్ల డోసుల వ్యాక్సిన్‍ను ఉత్పత్తి చేయగలిగి ఉండాలని అమెరికా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇది కాకుండా, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, యు.ఎస్.ఎ.ఐ.డిల నుంచి ఆరోగ్య, వైద్య నిపుణులను పెద్ద సంఖ్యలో భారత్‍కు పంపిస్తోందని, వీరు భారత్‍లోని అమెరికా రాయబార కార్యాలయం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో కలిసి పని చేస్తారని ఆయన వెల్లడించారు. గ్లోబల్ ఫండ్ సంస్థ ద్వారా అతి వేగంగా నిధులు, వైద్య, ఆరోగ్య సరంజామాను సరఫరా చేయడానికి కూడా వీరు తోడ్పడతారని ఆయన తెలిపారు. ఈ రెండు దేశాలూ సమన్వయంతో పని చేసి, భారత్‍లో కరోనాను అదుపు చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా ఆయన తెలియజేశారు.