కరోనా వేవ్స్… కంటిన్యూ అవుతాయా..?

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా దెబ్బకు దేశాలన్నీ కకావికలమైపోతున్నాయి. చైనాలో ఏడాదిన్నరక్రితం మొదలైన ఈ మాయదారి వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఓసారి ఇప్పటికే చుట్టేసింది. ఇప్పుడు రెండోసారి చుట్టుకుంటూ వస్తోంది. భారత్ లో ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ వేవ్ మొదలైందని చెప్పొచ్చు. మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ.. లాంటి రాష్ట్రాలు సెకండ్ వేవ్ దెబ్బకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని ఎదుర్కొనే మార్గాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీనికి మందు లేకపోవడం, వ్యాక్సిన్ కూడా పూర్తిస్థాయి పరిష్కారం కాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి.
అయితే కరోనా వేవ్స్ ఇప్పట్లో ఆగవనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కరోనా వైరస్ మ్యుటేషన్ చెందుతూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 2019 డిసెంబర్ లో తొలిసారి చైనాలో ఈ వైరస్ ను కనుగొన్నారు. అది చైనాను దాటి దేశాలకు విస్తరించడానికి మూడు, నాలుగు నెలల సమయం తీసుకుంది. దీంతో చాలా దేశాలు గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకూ ఫస్ట్ వేవ్ ను చవిచూశాయి. అమరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇప్పటికీ వేవ్ విశ్వరూపం కొనసాగుతూనే ఉంది. అది ఫస్ట్ వేవో.. సెకండ్ వేవో.. థర్డ్ వేవో కూడా అంచనా వేయడానికి వీలు కావట్లేదు.
భారత్ లో గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ ఫస్ట్ వేవ్ నడిచింది. ఆ తర్వాత వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కనిష్ట స్థాయిలో కేసులు నమోదవడం మొదలయ్యాయి. దీంతో కరోనా పీడ విరగడయ్యే రోజులు వచ్చేసాయని అందరూ సంబరపడ్డారు. ప్రభుత్వాలు కూడా కరోనా ఇక ముగిసిన అధ్యాయమని ప్రకటించాయి. ఇంతలో ఏమైందో ఏమో.. నెల రోజులుగా కరోనా విశ్వరూపం మళ్లీ మొదలైంది. అంచనాలకు కూడా అందకుండా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో కూడా నిర్దిష్టంగా అంచనా వేయలేకపోతున్నారు. అయితే జూన్ రెండో వారం వరకూ ఈ సెకండ్ వేవ్ కొనసాగుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని ఊహిస్తున్నారు.
అయితే ఈ లోపే వైరస్ మరింత మ్యుటేట్ చెందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. భారత్ లో ఇప్పుడు రెండు రకాల మ్యుటెంట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి వేగంగా వ్యాపిస్తోంది. కేసులు విపరీతంగా పెరిగిపోవడానికి ఈ మ్యుటెంటే కారణమని చెప్తున్నారు. ఇది మరింత మ్యుటేట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. ఇదే జరిగితే మరికొంతకాలం తర్వాత మరో వేవ్ కూడా రావచ్చని అంచనా వేస్తున్నారు. మొదటి వేవ్ కు, సెకండ్ వేవ్ కు మధ్య సుమారు 6 నెలల సమయం ఉంది. అయితే మొదటి వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది. దీన్ని బట్టి మూడో వేవ్ రావడానికి 6 నెలల కంటే తక్కువ సమయమే పట్టొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితం ఈ ఏడాదిలోనే మనం థర్డ్ వేవ్ ను చూసే ప్రమాదం ఉంది.
థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయటపడాలంటే భౌతికదూరం పాటించడం, మాస్క్ నిత్యం ధరించడం ఒక్కటే మార్గం. అంతేకాక.. అర్హులైన అందరూ టీకాలు వేసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ఛాన్స్ ఉంది. వైరస్ తీసుకున్నవాళ్లకు ప్రాణాపాయం ఉండట్లేదు. వైరస్ వచ్చినా క్షేమంగా బయటపడొచ్చు. అందుకే ప్రభుత్వం కూడా 18ఏళ్ల పైబడినవారందరికీ మే 1 నుంచి టీకాను అందుబాటులోకి తెస్తోంది. బహుశా ఇలాంటి వేవ్స్ ముందుముందు కూడా వస్తాయనే అంచనాలతోనే అందరికీ టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.