దేశంలో రికార్డు స్థాయిలో కేసులు… ఒక్క రోజులోనే

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. తాజాగా ఐదో రోజు కూడా రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,02,367 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,52,991 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రికార్డు స్థాయిలో 2,812 మరణాలు రికార్డయ్యాయని చెప్పింది. నిన్న ఒకే రోజు 2,19,272 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కు చేరింది. ఇప్పటి వరకు 1,43,04,382 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మొత్తం 1,95,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. మరోవైపు ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 14,19,11,223 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో 66,191 కేసులతో మహారాష్ట్ర టాప్‍లో ఉంది.