దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న మొన్నటి వరకు 16వేలల్లోపు నమోదైన కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,327 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 14,234 మంది వైరస్ నుంచి కోలుకున్నారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 1,11,92,088కు పెరిగింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,08,54,128 మంది కోలుకున్నారని కేంద్రం చెప్పింది. వైరస్ ప్రభావంతో 108 మంది మృత్యువాతపడగా… మొత్తం మృతుల సంఖ్య 1,57,656కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 1,80,304 యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్‍లో భాగంగా 1,94,97,704 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా ఒకేరోజు దేశవ్యాప్తంగా 7,51,935 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు 22.06 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.