కోరుకున్న వారికి కాదు… అవసరం ఉన్న వారికే

దేశంలో రెండో దఫా కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ అన్ని వయసుల వారికి కొవిడ్ వ్యాక్సిన్ అందించాలనే డిమాండ్ ఎక్కువయ్యింది. ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోరుకున్న వారికి వ్యాక్సిన్ అందించడం ముఖ్య విషయం కాదని, అవసరమైన వారికే ముందుగా టీకా ఇవ్వడం అత్యంత ప్రధానమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఎందుకు అందించకూడదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరణాలను నివారించడం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను కాపాడుకోవడమనే రెండు ప్రధాన లక్ష్యాలతోనే ఈ వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతోందన్నారు.
కోరుకున్న వారికి వ్యాక్సిన్ అందించడం ప్రధాన ఉద్దేశం కాదు కేవలం అత్యవసరమైన వారికి ఇవ్వడమే ఈ టీకా పంపిణీ ప్రధాన లక్ష్యం అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. అందుకే వైరస్ ప్రమాదం పొంచివున్న వారికే వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.