ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు కరోనా

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‍గా తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‍లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, స్వల్పంగా వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనిల్ బైజాల్ తెలిపారు. అందువల్ల ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజులపాటు క్వారెంటైన్‍లో ఉండాలని కోరారు. ఢిల్లీ వైరస్ తీవ్రత తీవ్రంగా ఉన్నందున తాను మహమ్మారి బారి నుంచి కోలుకునే వరకు ఇంటి నుంచే విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత నెలలోనే బైజల్ తన సతీమణితో కలిసి కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు టీకా తీసుకున్నారు.