టిఎల్ సిఎ ఉగాది ఉత్సవాలు…అదిరిపోయిన “పంచెకట్టు” ఫ్యాషన్ షో
న్యూయార్క్ లోని తెలుగు సార్వత్రక సాంస్కృతిక సంఘం (టిఎల్ సిఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది 2026 ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పంచెకట్టు ఫ్యాషన్ షో అదిరిపోయింది. ఫ్యాషన్ షో లు ఆడవారికి మాత్రమే పరిమితం కాదు, మగవారు కూడా చెయ్య వచ్చు, అదికూడా సంప్రదాయ సిద్దమైన చేనేత పంచెలతో అని నిరూపించారు న్యూయార్క్ తెలుగు పురుషులు. న్యూయార్క్ “జవానీస” నెహ్రూ కఠారు, కిరణ్ రెడ్డి పర్వతాల, ప్రసాద్ డబ్బీరు, హరిశంకర్ రసపుత్ర, కార్తీక్ మన్నెం, సుమంత్ రాంశెట్టి ఆధ్వర్యంలో టిఎల్ సిఎ వేదికమీద జరిగిన ఈ ఫాషన్ షో లో దాదాపు 60 మందికి పైగా మగవారు పాల్గొన్నారు.
ఈ రోజులలో మగవారు పంచెకట్టడం చాలా తగ్గిపోయింది. పెళ్లిళ్లలో, ఫంక్షన్స్ లో పంచె కట్టినా అది నార్త్ ఇండియన్ స్టైల్ మరియు ఇండో-వెస్ట్రన్ స్టైల్ లో మాత్రమే. సిసలైన తెలుగోడి పంచె కట్టు కనుమరుగవుతున్న ఈ తరుణంలో, చేనేత పంచెలతో ఫాషన్ షో చేసి, అంతరించి పోతున్న తెలుగు సంప్రదాయాన్ని పరిరక్షించటమే కాకుండా, భావితరాలకు మన సంప్రదాయాన్ని తెలియజెప్పే ప్రయత్నమే ఈ “పంచెకట్టు” కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి, దాతలకు, ప్రెసిడెంట్ సుమంత్ రాంశెట్టి గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, దీనికి సహకరించిన శిరీష తూనుగుంట్ల గారికి జవానీస్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ పంచెకట్టు కార్యక్రమ స్పూరితో సంవత్సరానికి ఒక రోజు, మనదైన ఉగాది పండుగ రోజు మగవారందరు పంచె కట్టుకుంటారనే ఆకాంక్ష ని “జవానీస” తెలియజేసారు.








