TTA: సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీటీఏ ఆధ్వర్యంలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
వరంగల్: దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA), సీకేఎం కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను ఘనంగా ప్రారంభించారు. పేద విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో టీటీఏ ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. ధర్మారెడ్డి కలిసి రెండు కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ, కళాశాల నేపథ్యాన్ని, ఆచార్య చందకాంతయ్య శ్రేష్టి కళాశాల స్థాపనకు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఐటీ రంగానికి ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మౌరీటెక్ (MOURITECH) హైదరాబాద్ సహకారంతో 50 అత్యాధునిక కంప్యూటర్లను అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అలాగే కళాశాల అభివృద్ధి కోసం రెండు ఏసీలను విరాళంగా ఇచ్చిన పూర్వ విద్యార్థులను ఆయన అభినందించారు.
లెర్న్ టు ఎర్న్…
టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది మాట్లాడుతూ, సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ‘టీటీఏ సేవా డేస్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సుమారు 40 మంది టీటీఏ ప్రతినిధులు అమెరికా నుండి తెలంగాణకు వచ్చి వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. ఈ ప్రాజెక్ట్ నిర్వాహకుడు, టీటీఏ లిటరరీ డైరెక్టర్, కళాశాల పూర్వ విద్యార్థి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కంప్యూటర్ల విరాళం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో తాను ఇక్కడ చదువుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని కష్టపడి చదవాలని ఆయన పిలుపునిచ్చారు. మౌరీటెక్ ప్రతినిధి భాను మాట్లాడుతూ, తాము అందించిన 50 కంప్యూటర్లలో ఉపాధికి అవసరమైన లేటెస్ట్ సాఫ్ట్వేర్ వెర్షన్లు ఉన్నాయని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలు పెంచుకుంటే తమ సంస్థలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీటీఏ 10వ వార్షికోత్సవ వేడుకల చైర్ డాక్టర్ దొంతిరెడ్డి నరసింహా రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల కోసం “లెర్న్ టు ఎర్న్” అనే అవకాశాన్ని ఈ ల్యాబ్ ద్వారా కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీఏ ప్రతినిధులు శివారెడ్డి, పెద్దిరెడ్డి, స్వాతి చెన్నూరి, నరసింహ పెరుక, ప్రవీణ్ చింత, జ్యోతి రెడ్డి దూదిపాల, విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






