ATA: డల్లాస్ కాల్పుల్లో కొడుకును కోల్పోయిన తల్లికి ‘ఆటా’ అండ
హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఘోర కాల్పుల్లో కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక పేద కుటుంబానికి ‘ఆటా’ (అమెరికా తెలుగు అసోసియేషన్) పెద్ద దిక్కుగా నిలిచింది. అమెరికాలోని డల్లాస్ నగరంలో తన కుమారుడు చంద్రశేఖర్‌ను కోల్పోయిన తల్లిని ఆటా ప్రతినిధులు పరామర్శించి, మానవత్వాన్ని చాటుకున్నారు.
రూ. 50 లక్షల ఆర్థిక భరోసా
డల్లాస్ కాల్పుల ఘటనలో మరణించిన చంద్రశేఖర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆటా ప్రతినిధులు నడుం బిగించారు. అమెరికాలో ‘గో ఫండ్ మీ’ ద్వారా సేకరించిన 50 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి త్వరలోనే అందజేస్తామని ఆటా ప్రతినిధులు ప్రకటించారు. కష్టాల్లో ఉన్న ఒక తెలుగు కుటుంబానికి ఇంత పెద్ద మొత్తంలో సాయం ప్రకటించడం ఆటా సేవా దృక్పథానికి నిదర్శనం.
నిజమైన వారధిగా ‘ఆటా’ ప్రతినిధులు
ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న ఆటా ప్రతినిధులు, బాధిత తల్లి ఆవేదనను స్వయంగా విన్నారు. “తినడానికి తిండి లేకున్నా ఎంతో కష్టపడి పిల్లలను చదివించాం. కానీ విధి మా జీవితాన్ని తారుమారు చేసింది” అని ఆమె కన్నీటి పర్యంతమవ్వగా, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి ఆమెను ఓదార్చారు. కుమారుడిని కోల్పోయినప్పటికీ, ధైర్యంగా మిగిలిన పిల్లలను చదివించుకుంటున్న ఆమె ఆత్మస్థైర్యానికి వారు అభినందనలు తెలిపారు.
ప్రముఖుల సమక్షంలో సన్మానం
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లిని సన్మానించారు. ఆటా ప్రతినిధులు ఆమెకు సామాజికంగా, ఆర్థికంగా అండగా ఉంటామని ఇచ్చిన హామీ పట్ల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటాకు చెందిన అనేక మంది కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. నరసింహ ద్యాసాని (కో-చైర్), సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి (ట్రెజరర్), శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు ఈ బృందంలో ఉన్నారు.






