ATA: పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించిన ఆటా
- ఎర్త్ సెంటర్ ఏర్పాటులో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సేవలు ఆదర్శం
- ఎర్త్ సెంటర్ ను పరిశీలించిన ఆటా ప్రతినిధులు, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి తదితరులు
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ దిశగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి ప్రశంసించారు. శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామ పరిధిలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎర్త్ సెంటర్ను ఆటా ప్రతినిధులు, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థాపక చైర్మెన్ లీలా లక్ష్మారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, వినూత్న విధానాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు కూడా మాతృదేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి సంస్థలతో కలిసి పనిచేసి, గ్రీన్ కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆటా సిద్ధంగా ఉందని తెలిపారు. ఎర్త్ సెంటర్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసి ఎంతో ప్రేరణ లభించిందని, భవిష్యత్తులో సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయాలని ఆకాంక్షించారు.
అంతకముందు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ లీలా లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో గత 15 సంవత్సరాలుగా సంస్థ పనిచేస్తోందని తెలిపారు. ప్రకృతి సమతుల్యతను కాపాడే లక్ష్యంతో విత్తనోత్పత్తి, సేంద్రియ ఎరువుల తయారీ, సహజ వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ, సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని ఎలా పెంపొందించవచ్చో ప్రదర్శనలతో తెలియజేశారు. ఎర్త్ సెంటర్లో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్నతనంలోనే పర్యావరణంపై అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా వారు ఎదుగుతారని పేర్కొన్నారు. నీటి సంరక్షణ, వృక్షారోపణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడం ద్వారా పర్యావరణహిత జీవన విధానాన్ని అలవాటు చేస్తున్నామని చెప్పారు.
అనంతరం సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఒక్క సంస్థకే పరిమితం కాకుండా గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల వారిగా ప్రణాళికలు రూపొందించి, ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విధానాలు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమిష్టి కృషి చేయాలని సూచించారు.
వారితో పాటు ఎర్త్ సెంటర్ ను పరిశీలించిన వారిలో ప్రొఫెసర్ దిలీప్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు వున్నారు.






