సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టీసీఏ స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరణ..
అమరావతి: తెలుగు సంస్కృతి పరిరక్షణలో ఐదు దశాబ్దాల మైలురాయిని చేరుకుంటున్న తెలుగు సాంస్కృతిక సమితి (TCA) స్వర్ణోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అపూర్వ గౌరవం లభించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టీసీఏ స్వర్ణోత్సవ (Golden Jubilee) లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాబోయే టీసీఏ కన్వెన్షన్ అత్యంత వైభవంగా, విజయవంతంగా జరగాలని ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
తమ సంస్థకు, ప్రవాస తెలుగు సమాజానికి ముఖ్యమంత్రి గారు అందిస్తున్న ఈ ప్రోత్సాహం పట్ల టీసీఏ అధ్యక్షులు యాదగిరి రెడ్డి కుడుముల గారు, కన్వీనర్ జితేందర్ రెడ్డి గారు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు వంటి దార్శనిక నేత అండదండలు ఉండటం తమ సమాజానికి ఎంతో గర్వకారణమని వారు పేర్కొన్నారు.
వెంకట రమణ చొరవ…
ఈ కార్యక్రమంలో టీసీఏ కార్యక్రమ దృక్పథాన్ని, లోగోను గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రచయిత ఎం.ఎస్.ఆర్.వెంకట రమణకు (వెంకూ) టీసీఏ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఆయన చూపిన చొరవ మరియు సహకారం సంస్థకు ఎంతో విలువైనవని కార్యవర్గ సభ్యులు కొనియాడారు. పెద్దల ఆశీస్సులు మరియు ప్రోత్సాహంతో, ఈ స్వర్ణోత్సవ వేడుకలను తెలుగు వారు గర్వపడేలా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు టీసీఏ ప్రతినిధులు వెల్లడించారు.








