దివికేగిన దిగ్గజ దర్శకుడు… భారతీరాజా
భారతీయ సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన ప్రతిభతో వెండితెరపై సరికొత్త విప్లవాన్ని సృష్టించిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీ రాజా (84) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, జూన్ 10వ తేదీన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వినగానే తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఎందరో నటీనటులను, దర్శకులను పరిచయం చేసిన ఒక గొప్ప గురువుని కోల్పోయామని సినీ లోకం కన్నీరు మున్నీరైంది. భారతీయ సినిమా వేగంగా పరుగులు పెడుతున్న క్రమంలో కమర్షియల్ ఫార్ములాల నడుమ సరికొత్త సృజనాత్మక ఒరవడిని సృష్టించిన అరుదైన దర్శకుడు భారతీరాజా.
ఒకప్పుడు కేవలం ఇండోర్ సెట్లకు, కృత్రిమమైన వాతావరణానికి పరిమితమైన తమిళ సినీ రంగాన్ని, స్టూడియోల నాలుగు గోడల మధ్య నుండి బయటకు తెచ్చి పచ్చని పల్లెటూరి పొలాల్లోకి.. సహజమైన లొకేషన్లలోకి నడిపించిన ఘనత ఆయనదే. సినిమా కథ అంటే కేవలం రాజులు, రౌడీలు, అసాధారణ హీరోలు మాత్రమే కాదు.. సామాన్య మానవుల జీవితాలు… వారి ఎమోషన్స్ చుట్టూ కూడా అద్భుతమైన డ్రామాను పండించవచ్చని ఆయన నిరూపించారు. మట్టిసువాసన కెమరాలను ముద్దాడాయి అంటే అది కేవలం భారతీరాజా వల్లే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వైవిధ్యభరిత సినిమాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. 1970, 80 దశకాల్లో ఆయన తన మార్క్ సినిమాలతో థియేటర్ల ముందు జనాలను క్యూ కట్టించారు. పల్లె సౌందర్యాన్ని కథగా.. అందులో నుంచి వచ్చే మట్టి సువాసనలనే బంధాలుగా ఆయన తీర్చిదిద్దిన పాత్రలు ఇప్పటికీ అజరామరం. పల్లెటూరి అందాలు, అక్కడి ప్రజల ప్రేమానురాగాలు చాలా హృద్యంగా ఆవిష్కరించారు. బంధాలు, బంధుత్వాలు వాటి మధ్య వెతలు, కథలు అత్యంత సహజసిద్ధంగా ఆయన ఆవిష్కరించిన తీరు ఇప్పటికీ ఆదర్శనీయమే.. ముఖ్యంగా స్టూడియోలకే పరిమితం అయిన సినిమాను పల్లెకు చేర్చిన ఘనత మాత్రం భారతీ రాజాకే చెందుతుంది. భారతీ రాజా భౌతికంగా మనమధ్య లేకపోవచ్చు కానీ ఆయన తీసిన సినిమాలు.. గీసిన పాత్రలు ఇప్పటికీ.. ఎప్పటికీ.. చిరస్థాయిగా నిలిచిపోతాయి.
నేటితరం ఔత్సాహిక చలనచిత్ర దర్శకులు కేవలం సాంకేతికతపైనే కాకుండా కథపై పట్టు సాధించాలంటే భారతీరాజా మేకింగ్ శైలిని ఒక పాఠ్యపుస్తకంలా చదవాల్సిందే. భారతీరాజా ఎంచుకునే కథాబలం అత్యంత సహజమైనది. సమాజానికి అత్యంత దగ్గరగా ఉండేది. కుల వివక్ష, గ్రామీణ ప్రాంతాల్లోని ఆచారాలు, పరువు ప్రతిష్టలు, మానవ సంబంధాలలోని సున్నితమైన కోణాలను ఆయన తన కథా వస్తువులుగా ఎంచుకున్నారు. పదునారు వయదినిలే (తెలుగులో పదహారేళ్ల వయసు),ఎర్ర గులాబీలు, సీతాకోకచిలుక వంటి చిత్రాలే అందుకు సజీవ సాక్ష్యాలు. నేటితరం దర్శకులు కోట్లాది రూపాయల బడ్జెట్… భారీ గ్రాఫిక్స్ ఉన్నప్పుడే సినిమా అద్భుతంగా వస్తుందనే భ్రమలో ఉన్న తరుణంలో బలమైన మట్టి వాసన ఉన్న కథ ఉంటే సామాన్య బడ్జెట్తోనూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయవచ్చనే పాఠాన్ని భారతీరాజా కథల ఎంపిక మనకు నేర్పుతుంది.
ఆయన స్క్రీన్‌ప్లే టెక్నిక్.. పాత్రల చిత్రణ అత్యంత విలక్షణమైనవి. భారతీరాజా సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత.. స్వభావం ఉంటాయి. కథనంలో డ్రామాను నడిపించడానికి ఆయన ఎంచుకునే విజువల్ మ్యాపింగ్ – రూపకాలు, పల్లెటూరి వాతావరణాన్ని కెమెరాలో బంధించే విధానం అద్భుతంగా ఉంటాయి. సంగీతాన్ని.. ముఖ్యంగా ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కథనంలో ఒక పాత్రలా ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. దృశ్యానికి, హృదయాన్ని ఆకట్టుకునే థీమ్ కు మధ్య సమతుల్యతను కాపాడుతూ ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా స్క్రీన్‌ప్లేను ఉత్కంఠభరితంగా మలచడం ఆయన ప్రత్యేకత.
భారతీరాజా 1941 జూలై 17న తమిళనాడులోని అల్లినగరంలో జన్మించారు. బాల్యం నుంచి ఆయనకు కళలంటేనే మక్కువ. 1977లో వచ్చిన తమిళంలో వచ్చిన ‘16 వయతినిలే’ భారతీరాజా మొదటి సినిమా.. అదే సినిమాను తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ చేశారు. నటీనటులకు మేకప్ లేకుండా సహజంగా చూపించడం ఆయన ప్రత్యేకత. పల్లె అందాలకే పరిమితం కాకుండా ఎగ్రగులాబీలు అనే సైకలాజికల్ థ్రిల్లర్ ద్వారా తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సొంతం చేసుకుంది.
అలైగల్ ఒయివదిల్లై’ చిత్రం ద్వారా రాధను నాయికగా పరిచయం చేశారు. ఇదే చిత్రం తెలుగులో భారతీరాజా దర్శకత్వంలోనే ‘సీతాకోకచిలుక’గా రూపొందింది. ఈ సినిమా ద్వారా ముచ్చెర్ల అరుణ నాయికగా పరిచయమయింది. తెలుగులో కార్తిక్‌కు ఇదే తొలి చిత్రం. ఇక భారతీరాజా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక’ కూడా అప్పటి యువతరాన్ని ఆకట్టుకుంది. తెలుగులో “యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు” వంటి చిత్రాలు రూపొందించి ఘన విజయం సాధించారు.
నటీనటుల నుండి నటనను రాబట్టడంలో .. సరికొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయడంలో భారతీరాజాది ఒక ప్రత్యేక శైలి. శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి నటులకు వారి కెరీర్ లోనే మరుపురాని పాత్రలను అందించడమే కాకుండా.. రాధిక, సుహాసిని, భాగ్యరాజ్ వంటి ఎందరో మేటి నటీనటులను, దర్శకులను ఆయనే స్వయంగా వెండితెరకు పరిచయం చేశారు. నటుల గ్లామర్‌ను కాకుండా వారిలోని సహజ నటనను వెలికితీయడంలో ఆయన సిద్ధహస్తుడు. నేటితరం ఔత్సాహిక దర్శకులు ఒక నటుడి నైపుణ్యాన్ని ఎలా గుర్తించాలి? పాత్రకు తగినట్లుగా వారిని ఎలా మలచాలి అనే అద్భుతమైన టెక్నిక్‌ను భారతీరాజా దర్శకత్వ పద్ధతుల నుండి నేర్చుకోవచ్చు.
నటుడిగా మెప్పించి..
అవార్డులు అందుకొని:
దర్శకత్వానికి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారతీ రాజా నటుడిగానూ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సుమారు 20 సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగానూ మెప్పించారు. చివరగా మోహన్ లాల్ నటించిన ‘తుడరుమ’ అనే చిత్రంలో ఆయన నటించారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2004లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయన ప్రతిభకు గుర్తింపుగా 6 జాతీయ అవార్డులు కూడా దక్కాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో హై-ఎండ్ కెమెరాలు… అత్యాధునిక ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ సినిమాలలో ఆత్మ లోపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వర్ధమాన దర్శకులు భారతీరాజా సినిమాటోగ్రఫీ సెన్స్…స్థానిక నేటివిటీని పండించే విధానం.. ఎమోషనల్ కనెక్టివిటీని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాంకేతికత అనేది కేవలం కథను చెప్పడానికి ఒక సాధనం మాత్రమేనని… అసలైన సినిమా ప్రేక్షకుడి హృదయాన్ని తాకే కథా కథనాలలోనే ఉంటుందని భారతీరాజా సినీ ప్రయాణం నేటితరానికి చాటిచెబుతోంది. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో అలరించిన ఆయన 6 జాతీయ అవార్డులు అందుకున్నారు. భారతీరాజా ఇక లేరు అనేది ప్రజలు జీర్ణించుకోలేనిది. సినిమాను అమితంగా ప్రేమించి, శ్వాసించి, వెండితెరపై అద్భుతాలు సృష్టించిన భారతీ రాజా మరణం సినీ రంగానికి తీరని లోటు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.








