Toxic: మరోసారి టాక్సిక్ వాయిదా.. ఎందుకంటే?
రాకింగ్ స్టార్ యష్(Yash) హీరోగా గీతూ మోహన్ దాస్(Geethu mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్(Toxic) పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మార్చుకోవడంతో వార్తల్లో నిలిచింది. మొదట అనుకున్న తేదీలకు రిలీజ్ కాకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందగా, చివరకు జూన్ 4ను ఫైనల్ డేట్‌గా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తేదీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండగా, తాజా ప్రకటనతో ఆ సందేహాలకు ముగింపు లభించింది.
తాజాగా హీరో యష్ స్వయంగా ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కావడం లేదని అధికారికంగా వెల్లడించాడు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ స్థాయి సినీ ఈవెంట్లో టాక్సిక్‌కు వచ్చిన రెస్పాన్స్ చాలా పాజిటివ్‌గా ఉందని, ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ స్థాయిలో సరైన విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విడుదల ప్రణాళికలను మళ్లీ సమీక్షిస్తున్నట్లు తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం కోసం మరింత సమయం అవసరమైందని ఆయన వివరించాడు.
ఈ ప్రకటనతో మరోసారి విడుదల వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసినా, సినిమా స్థాయిని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టాక్సిక్ను అంతర్జాతీయ ప్రమాణాలతో విడుదల చేయాలనే యత్నం దీని వెనుక ఉన్న ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొత్త రిలీజ్ డేట్ పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉండగా, ఈ చిత్రం ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.







