సమ్మర్ లో క్లిక్ అయ్యేదెవరు?
టాలీవుడ్లో ఈ సమ్మర్ సీజన్ ఓ ఆసక్తికరమైన మార్పుకు వేదికగా మారింది. స్టార్ హీరోల గైర్హాజరీతో మే 2026లో థియేటర్లలో ఒక రకమైన ఖాళీ కనిపిస్తున్నా, అదే సమయంలో మిడ్ రేంజ్ మరియు చిన్న బడ్జెట్ సినిమాలకు ఇది గోల్డెన్ అవకాశంగా మారింది. వేసవి సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం వంటి ఫ్యాక్టర్స్ ఈ సినిమాలకు పెద్ద ప్లస్. ఈ పరిస్థితిలో కంటెంట్ బలంగా ఉంటే, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది.
ఈ నెలలో ముఖ్యంగా సమంత(Samantha), నిఖిల్(Nikhil), తరుణ్ భాస్కర్(Tharun Bhasker) వంటి నటీనటులకు ఇది కీలక సమయం. చాలా గ్యాప్ తర్వాత సమంత మా ఇంటి బంగారం(maa inti bangaram)తో ప్రేక్షకుల ముందుకు రానుండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. నందినీ రెడ్డి(Nandini reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా మే 15న విడుదల కానుంది. ఈ సినిమాతో సమంత నిర్మాతగా కూడా అడుగుపెడుతుండటం మరో హైలైట్. మరోవైపు కార్తికేయ2(Karthikeya2) తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్, భారీ బడ్జెట్‌తో రూపొందిన పీరియాడిక్ డ్రామా స్వయంభు(Swayambhu)పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మే 22న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, హీరోగా తన స్థానం నిలబెట్టుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తున్నాడు. గాయపడ్డ సింహం(Gayapadda simham)తో మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న అతను, ఈసారి తప్పకుండా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల అతని నటనకు పెద్దగా స్పందన రాకపోయినా, ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే, స్టార్ డమ్ కంటే కంటెంట్ ప్రధానమయ్యే ఈ మే నెల, టాలీవుడ్లో కొత్త విజయ కథలను రాయబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.








