కథ 4: రిక్షా కథ —రావి కొండలరావు
Ravi Kondala Rao Hasya Kathalu – Part4
పెద్ద ఆఫీసరు ముందు చిన్న గుమస్తా ఎంత వినయంగా నించోవాలో అంత వినయంగానూ నించున్నాడు రామ్మూర్తి. చేతులు కట్టుకున్నాడు. పాదాలు దగ్గరగా పెట్టుకున్నాడు. మినుకుమినుకుమని కళ్లజోళ్లోంచి చూస్తూ కనురెప్పలు కొడుతు న్నాడు. ఆఫీసరు పనిమీద ఉన్నాడు. రామ్మూర్తి ముళ్లమీద వున్నాడు. తనకి బండికి టైమవుతోంది ఆఫీసరు ఊ అనడంలేదు. క్షణక్షణాల నిశ్శబ్దం రామ్మూర్తికి యుగయుగాల్లా వుంది. ఇక తట్టుకోలేక “సార” అన్నాడు నోరూ నాలికా కదల్చకుండా పెదవులతోనే.
“ఇంకా వెళ్ళలేదా నువ్వు? వెళ్ళవయ్యా మీ చెల్లెలికి పెళ్లి అంటున్నావు. బండికి టైము లేదంటున్నావు. ఇంకా ఇక్కడే నించున్నావేం బయల్దేరు” అన్నాడు ఆఫీసరు మళ్లీ పనిలో మునిగిపోయి. ‘అమ్మయ్య’ అనుకున్న రామ్మూర్తి మాటవరసకైనా థాంక్స్ అనలేదు. అనడానికి కూడా టైములేదు, పరుగెత్తాడు. తనింకా డబ్బు సంపాదించాలి. ఆర్డరిచ్చిన నగని షాపులో తీసుకోవాలి. బండి పట్టుకోవాలి. టైము దగ్గరయిపోతోంది.
రామ్మూర్తి పరుగు పరుగున వెళ్లి తన మిత్రుడింట్లో వాలి… “డబ్బు… డబ్బు…” అన్నాడు ఆయాసపడుతూ. మిత్రుడు కూచోమన్నాడు. ఆయాస పడుతున్నావు మంచినీళ్లు తాగమన్నాడు. దేనికీ తనకి టైములేదు, డబ్బు ఇస్తే బయల్దేరాలన్నాడు రామ్మూర్తి. మిత్రుడు కవర్లో పెట్టి పదివేల రూపాయలిచ్చాడు. “ఇందులో నగకి నాలుగు వేలుపోతే ఇంకా ఆరువేలుంటుంది. జాగ్రత్త. అన్నట్టు ఆఫీసు లోన్ రాగానే జాగ్రత్తగా నాకు తీర్చేయ” అంటున్నాడు మిత్రుడు. రామ్మూర్తి ఏమీ పట్టించు కోలేదు. కవరు తీసుకుని పరుగెత్తి నగల కొట్లో సిద్దంగా వున్న నగని తీసుకుని రూముకి వెళ్లి బెడ్డింగు కట్టి, పెట్టెలో బట్టలు పెట్టి ఇంకో సంచిలో కొన్ని వస్తువులు కూరి, బ్రీఫ్ కేసులో డబ్బు, నగ వున్న పెట్టె, చిన్న తువ్వాలు, బ్రష్లు వగైరాలు పడేసి, రిక్షా పిలిచి రూము తాళం పెట్టి, సామాన్లు ఎక్కించి తానూ కూచుని ‘ఇస్సు’ అనుకున్నాడు. రిక్షాని బలంగా తొక్కమన్నాడు. కారు వెళ్లినంత వేగంగా స్టేషనుకు పరుగెత్తమన్నాడు. అలా అడావుడి పడిపోతున్న రామ్మూర్తి రిక్షావాడికి వింతగా కనిపించలేదు. తన మామూలు వేగంతోనే, ట్రాఫిక్కుని దూసుకుంటూ తోసుకుంటూ స్టేషన్ చేరుకున్నాడు. “టైములేదు టైము లేదు” అనుకున్నాడు రామ్మూర్తి మరింత అడావుడిగా రిక్షావాడికి డబ్బిచ్చేసి, రెండు చేతులా సామాన్లు తీసుకుని పరుగెత్తుతూ.
రామ్మూర్తి స్టేషన్ జనంలోనూ, రిక్షావాడు బయట జనంలోనూ కలిసి పోయారు. కక్కుకుంటున్న చెమటని తుడుచుకుంటూ ప్లాట్ఫాంమీద పడిన రామ్మూర్తికి తను వెళ్ళవలసిన రైలు గంట లేటని తెలిసింది. గట్టిగా ఓసారి ఊపిరి పీల్చుకుని, నిదానంగా సామాను నేలమీదికి దించుతూ, చూసుకుంటే… బ్రీఫ్ కేసు లేదు! రామ్మూర్తి గుండెల్లో నాలుగైదు రైళ్లు గుద్దుకున్నంత పెద్ద శబ్దం అయింది. “నా చిన్న పెట్టె, నా చిన్న పెట్టె” అని అరిచాడు ఇటూ అటూ చూస్తూ. అప్పుడుగానీ అతనికి గుర్తు రాలేదు. అడావుడిగా రిక్షాలోంచి సామాన్లు దింపినపుడు మూడే దించాడు. అసలైన పెట్టె – ఆ చిన్నపెట్టె అందుకోలేదు. దాన్ని తన పక్కనే సీట్లో మూలగా పెట్టాడు. తక్కినవి మూడూ ముందు వుండడం చేత అవే అందుకుని స్టేషన్లోకి పరుగెత్తాడు.
సామాన్లు మధ్యలో వేసుకుని చుట్టూ కూచుని వున్న ఓ పెద్ద సైజు కుటుంబీకులకి తన సామాను చూస్తూ వుండమని వప్పజెప్పి రామ్మూర్తి బయటికి పరుగెత్తాడు. తను రిక్షా దిగిన చోటు చూశాడు. ఆ పక్కా ఈ పక్కా చూశాడు. తను ఎక్కివచ్చిన రిక్షా కనిపించలేదు. ఓ మూల ఐదారు రిక్షాలు కనిపిస్తే అక్కడికి పరుగెత్తాడు. వాటిలో ఆ రిక్షా లేదు. ఫలానాలా వుంటాడు రిక్షామనిషి, ఫలానాలా వుంటుంది రిక్షా అది కనిపించిందా – అని అడిగాడు. వాళ్ళెవరూ చూడలేదన్నారు.
ఆ రిక్షా ఎందుకు, మేం వస్తాం ఎక్కమన్నారు వాళ్లు విషయం తెలీక. రామ్మూర్తి వాళ్లకేం జవాబు చెప్పలేదు. పరుగెత్తాడు. గుండెలు కటకటా కొట్టుకుంటున్నాయి. కాళ్లూ చేతులూ గడగడా వణుకుతున్నాయి. చెమటలతో ఒళ్లంతా తడిసిపోతోంది… తన చెల్లెలి పెళ్లి… పెళ్ళిలో నగ… పెళ్ళికి కొంత నగదు… అన్నీ… పోయాయి! తన అడావుడిలో తాను చిన్న పెట్టె మరిచిపోయి పారిపోగా, రిక్షావాడు ఆ పెట్టెతో పారిపోయాడు. ఓ అరగంటపాటైనా ఆ రిక్షాకోసం వెతకాలని రామ్మూర్తి రోడ్డు మీదకొచ్చి నాలుగువేపులా కాలికొద్దీ పిచ్చివాడిలా పరుగెత్తాడు.
దూరంగా ఎక్కడో ఆగివున్న ఓ రిక్షా కనిపిస్తే మారుతంలా రివ్వున వెళ్లి చూశాడు. గంటలు వాయిస్తూ అటూ ఇటూ తిరుగుతున్న రిక్షాల్ని పరిశీలించాడు. జాడలేదు. రామ్మూర్తికి కచ్చితంగా నిర్ధారణ అయిపోయింది. పెట్టె పోయింది! తన అడావుడి, అజాగ్రత్తల వల్లే పోయింది. ఐనా తను ఊరుకోడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఊరికి వెళ్ళాలా, నగ, నగదు పోయాయని మానుకోవాలా అతనికేమీ తోచలేదు. అతని దృష్టంతా రిక్షాల మీద, రిక్షావాళ్ల మీదా వుంది. ఏవేవో రిక్షాలు, ఎందరెందరో రిక్షావాళ్లూ. కానీ ఆ రిక్షా మాత్రం కనిపించడం లేదు.
రామ్మూర్తి చెంపమీద, తల మీద కొట్టుకున్నాడు. కళ్లలో పొంగి వస్తున్న నీటిని తుడుచుకున్నాడు. కొట్టుకుంటున్న గుండెని అదుముకున్నాడు. ఇలా జరిగిందని చెల్లెలు పెళ్లికి వెళ్లకుండా ఎలా! వెళ్లాలి. జరిగిన విషయం తండ్రితో చెప్పి ఆలోచించాలి. బండి బయల్దేరే లోపల తను పోలీసు రిపోర్టు ఇవ్వాలి. దొంగతనం ఇప్పుడే జరిగింది. గనుక, పట్టుకోడం వాళ్లకి అంత కష్టం కాదు.
స్టేషన్కి దగ్గరగానే ఉన్న పోలీసు స్టేషన్కి వెళ్లి రామ్మూర్తి తన పేరు ఊరూ అడ్రసులూ వగైరా చెప్పి జరిగినదంతా వివరించాడు.
పొరపాటున తను మరిచిపోయి మళ్లీ వెంటనే తిరిగొచ్చే లోపలే రిక్షావాడు మాయమైపోయాడనీ, ఆ వెంటనే తను రిపోర్టు ఇవ్వడానికి వచ్చాననీ చెప్పాడు. తనకి గుర్తున్నంతవరకూ రిక్షావాడి పోలికలు చెప్పాడు. వెంటనే వెతికిస్తే సులభంగా పెట్టె దొరికిపోతుందని సలహా కూడా ఇచ్చాడు. పోలీసు వాళ్లు అన్నీ రాసుకున్న తర్వాత, తను నాలుగైదు రోజుల్లో తిరిగి వస్తాననీ, ప్రస్తుతానికి వెళ్లవలసిన అగత్యం అలాంటిదనీ నచ్చజెప్పి, బండి వచ్చే వేళైతే అదీ పోతుందనీ, తన తక్కిన సామాన్లూ పోతాయనీ చెప్పి, ఐదారుసార్లు ‘థాంక్సు’లు నాలుగైదుసార్లు ‘నమస్కారాలు’ చెప్పి ఫ్లాట్ఫారం మీదికి పరుగెత్తాడు.
బండి వచ్చే వేళయిందనీ, తన సామాను కాపాడుతున్న కుటుంబం తన కోసమే ఎదురుచూస్తోందనీ తెలుసుకుని వాళ్ళందరికీ థాంక్సుమీద థాంక్సు చెప్పి తన మూడు వస్తువులూ తీసుకుని జేబులో వున్న పర్సు తడుముకుని టిక్కెట్టు చూసుకుని నిట్టూరుస్తూ నిలబడ్డాడు. మరి కొద్దిసేపట్లో వచ్చిన బండిలోని తన పెట్టె ఎక్కి, సీట్లో కూలబడి, మూడు సామాన్లూ ఇంకోసారి సరిచూసుకుని, గడగడ కొట్టుకుంటున్న గుండెకి కొంత ధైర్యం చెప్పి, జరిగిన దానికి మధనపడుతూ వుండగా – రైలు బయల్దేరింది.
కాసేపటికి క్రితం …
రామ్మూర్తి రిక్షావాడికి అడావుడిగా డబ్బులిచ్చేసి, సామాన్లు తీసుకుని పరుగెత్తాక… ఆ రిక్షా రంగన్నకి వెంటనే బేరం దొరికింది. ఓ తల్లీ కొడుకూ చిన్న మూటతో ఎక్కారు. వాళ్లు చెప్పుకుంటున్న కబుర్లు వింటూ, పెరిగిపోతున్న జనాభాను చూస్తూ రిక్షా రంగన్న వాళ్ల వీధికి వచ్చాడు. “ఆపు నాయనా! ఇదే ఇల్లు” అందాతల్లి. అనుకున్నదానిమీద ఓ అర్ధరూపాయి ఎక్కువే ఇచ్చి, ఆ ఇల్లాలు దిగి పోయింది. దిగగానే సీటు సర్ది రిక్షా తిప్పుకుందాం అని చూడగా, చిన్న పెట్టె కనిపించింది. “అమ్మా! పెట్టె మర్చిపోయారు” అన్నాడు చూపిస్తూ. “ఆ పెట్టె మాదికాదే. ఇందాక మేం కూచున్నపుడు పక్కనే వుంటే నీదేమో అనుకున్నాం. కాదా?” అందామె. “కాదమ్మా” అన్నాడు రిక్షా రంగన్న. అప్పుడు గుర్తుకొచ్చింది – ఆ పెట్టె అంతకుముందు దిగిపోయిన ఆ అబ్బాయిగారిదని. ఆ మాటే వాళ్ళతో చెప్పి ఆ పెట్టె అతనికి వప్పజెప్పాలని స్టేషన్ వైపు బయల్దేరాడు. ఓ పది అడుగులు తొక్కే సరికి బేరం ఎదురైంది. జబ్బుతో ఉన్న పిల్లాడిని అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలిట. “ఈ పెట్టె రైలు టేశన్ ఇవ్వాలమ్మా. మీరింకో రిక్షా చూసుకోండి” అన్నాడేగానీ, చుట్టుపక్కల ఎక్కడా రిక్షా కనిపించక పోడంతోనూ, ఆ ముసలావిడ అవస్థ చూడలేకపోడంతోనూ బేరం ఒప్పుకోక తప్పలేదు. వాళ్లని పెద్దాసుపత్రికి తీసుకెళ్లి విడిచిపెట్టి, పెట్టె పట్టుకుని స్టేషన్ వైపు బండి తొక్కాడు. రిక్షాని ఓ మూల ఆపి పెట్టెతో స్టేషన్లోకి పరుగెత్తాడు.
జనం! మూడు ఫ్లాటుఫారాల నిండా కిటకిట లాడుతున్న జనం. ఆ జనంలో అతనెక్కడున్నాడో! అసలు అతను ఏ ఊరు వెళతాడో, ఏ బండి ఎక్కుతాడో తనకేం తెలుసు గనక! పెట్టె జాగ్రత్తగా పట్టుకుని ఫ్లాటుఫారాలన్నీ తిరిగాడు. మనిషి మనిషినీ పరిశీలించాడు. తన రిక్షాలో ఎక్కిన మనిషి రూపులాంటి మనిషే కనిపించలేదు. అతను నీలం రంగు చొక్కా వేసుకున్నాడు. కళ్లజోడుంది, చిన్న మీసం వుంది. ఆ మూడు గుర్తుల్నీ మనసులో పెట్టుకుని తిరిగాడు గానీ ప్రయోజనం లేకపోయింది. రంగన్నకి ఏం చెయ్యాలో తోచలేదు. చిన్నపెట్టె. పుస్తకాలో కాయితాలో వుండి వుంటాయి. అంత అవసరమైనదనుకుంటే అతనే వెనక్కి పరుగెత్తి వచ్చేవాడుగా! తను బేరం ఒప్పుకున్న లోపలే వచ్చివుండాలి. ఒకవేళ బండి సరిగ్గా వచ్చి నిలబడివుందేమో – ఎక్కి వెళ్లిపోయుంటాడు. అసలే కంగారుగా ఉన్నాడు. మరి ఈ పెట్టెని ఏం చెయ్యాలి? పైకెత్తి అటూ ఇటూ తిప్పి చూశాడు. తాళం వేసినట్టు ఉంది. చెరో పక్క రెండు ఇంగ్లీషు అక్షరాలు కనిపిస్తున్నాయి.
రంగన్నకి ఆలోచన తట్టింది. గబగబా వచ్చి రిక్షా ఎక్కి తొక్కుకుంటూ రామ్మూర్తి ఎక్కిన ఇంటి దగ్గరకెళ్లాడు. అటూ ఇటూ చూసి లోపలికెళ్లాడు. ఒకవైపు తలుపుకి తాళం పెట్టి వుంది. ఇంకో గది వేపు చూస్తే దానికీ తాళం వుంది. ఏదో గదుల లాడ్జిలాంటిదై వుంటుందనుకున్నాడు. ఓ నాలుగైదు నిమిషాలు ఆ పక్కా ఈ పక్కా చూశాడు. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ రాగా “ఈ తాళం పెట్టిన ఇంట్లో ఎవరూ లేరాండీ?” అని అడిగాడు అమాయకంగా. వాళ్ళిద్దరూ పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి ఒక నవ్వునే రెండుసార్లు నవ్వి “తాళం పెట్టిన ఇంట్లో ఎలా వుంటారు నాయనా” అనేసి వెళ్లిపోయారు. అతనొక్కడే ఆ గదిలో వుంటున్నట్టుగా, రంగన్న అర్థం చేసుకున్నాడు. ఏ ఊరు వెళ్లాడో, ఎప్పుడు వస్తాడో తెలీదు. తెలుసు కోడానికి అక్కడ వీలూ కనిపించలేదు, ఇహ అక్కడే వుండి పెట్టె ఎవరికో వప్పజెప్పి ‘ఇచ్చేయండి’ అనడం – క్షేమం కాదని తెలుసుకున్నాడు. కుటుంబం ఉన్న ఇల్లేమో ఇచ్చేసిపోదాం అనుకున్నాడు. కానప్పుడు ఎందుకూ! నాలుగైదురోజులు పోయాక, అతనే తిరిగివస్తాడు- అప్పుడొచ్చి పెట్టె వప్పజెప్పేయొచ్చు. రంగన్న “పాపం” అనుకున్నాడు. పెట్టెని తను తొక్కే సీటుకి జాగ్రత్తగా ఆనించి, బేరాలు తగుల్తాయేమోనని అటూ ఇటూ చూస్తూ నిరాశపడి, ఇక తొక్కే ఓపిక కూడా లేక చీకటి కూడా పడబోతోందని ఇంటి ముఖం పట్టాడు.
సంపాయించిన డబ్బుతో ఇన్ని బియ్యం, ఓ రెండు అరటిపళ్లూ కొని ఇల్లు చేరేసరికి దీపాలు పెట్టేశారు. మొగుడు తెచ్చిన బియ్యం అరటిపళ్లూ అందుకుంటూ “ఆ పెట్టేంటయ్యా” అని అడిగింది భార్య. “చెప్తాలే జాగ్రత్తగా లోపలెట్టు” అని కాళ్లూచేతులూ కడుక్కుని పెళ్లాం వేడిచేసి ఇచ్చిన టీనీళ్లు తాగి బీడీ వెలిగించి ఆమె అన్నం వండుతూ వుంటే పక్కనే కూచుని, పెట్టెకి సంబంధించిన కథంతా చెప్పాడు. “పాపం” అందామె.
మొగుడికి అన్నం వడ్డిస్తూ “తప్పుచేశావయ్యా. ఆ పెట్టేంటో అందులో ఏముందో అది ఇక్కడికెందుకు తెచ్చావు? పోలీటేశన్లో ఇచ్చేయాల్సింది. ఆళ్ళూ ఆళ్ళూ చూసుకుంటారు. నువ్వు ఎన్నిరోజులని ఆ ఇంటిచుట్టూ తిరుగుతావు?” అంది భార్య.
“నిజమేనే. ఆ అబ్బాయిగారి ఇల్లు, అతని పోలికా చెప్పి పెట్టె టేశన్లో ఇచ్చేయాల్సింది. ఆళ్లే అందజేసేవాళ్ళు. కానీ అతను ఊరెళ్లిపోయాడుగదా, ఇంట్లో ఇచ్చేద్దాంలే అని అలా తిరిగా”
“పోనీ ఇప్పుడైనా మించిపోయింది లేదు. అన్నం తినేసి చేసినికెళ్లి పోలీసోళ్ల కప్పజెప్పు. ఆళ్లేదైనా పెజింటిస్తారుకూడానూ. ఆ తర్వాత ఆ అబ్బాయిగారు కూడా ఏదైనా ఇవ్వచ్చు”
“నువ్వు చెప్పింది నిజమేనే! కానీ, ఇప్పుడికి ఓపికలేదో. ఇయాల బేరాలు బాగానే దొరికాయనుకో. అ అబ్బాయికోసం తిరగడంతో మరికొంత అలుపు వొచ్చేసింది. తెల్లారి లేస్తూనే ముందు టేశనికే ఎల్లి, పోలీసోళ్లకి పెట్టె ఇచ్చేసి, అప్పుడు బేరం ఒప్పుకుంటాను”
అలా ఏవో కబుర్లు చెబుతూనే రంగన్న మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు…
అర్ధరాత్రి వేళ, గుడిసె దగ్గర గట్టిగా మాటలు వినిపించాయి. వీధి కుక్కలు గంయ్మని అరుస్తున్నాయి. ఎవరో తడక తలుపు మీద కొడుతున్నట్టయి, రంగన్న లేచి తలుపు తెరిచాడు – పోలీసులు! రంగన్న అదిరిపోయి, అర్థంకాక చూశాడు. “ఈ రిక్షా నీదేనా?” అని అడిగాడు ఒక పోలీసు.
“అయ్యా నాదేనండి”
“మధ్యాహ్నం రైలుస్టేషన్కి ఓ మనిషిని నువ్వు తీసుకెళ్లావా? “ “తీసుకెళ్లానండి”
అంతలోనే ఇంకో పోలీసు గుడిసెలోకి దూరాడు. రంగన్న భార్య గాభరాపడిపోతూ ఏడుపు మొదలెట్టింది. టార్చిలైటువేసి, గుడిసెంతా వెదికి, ఓమూల భద్రంగా వున్న చిన్నపెట్టెని లాగాడు… పోలీసు.
“దొరికింది గురూ” అన్నాడు సంతోషంగా.
-పెద్దపోలీసు రంగన్న మొహంలోకి తీవ్రంగా చూశాడు ‘దొంగరాస్కెల్ పెట్టె కొట్టేసి గుడిసెలో దాస్తే తెలుసుకోలేం అనుకున్నావురా ఏం తీశావు అందులోంచి?” అని అరిచాడు.
రంగన్నకి చెమటలు పట్టాయి. “అందులో ఏముందో నాకేంతెలీదు బాబూ. అది ఒక బాబు మరిచిపోయి ఎల్లిపోతే, ఇచ్చేద్దాం అని రైలుటేశనంతా ఎతికాను కనిపించలేదు”.
“కనిపించకపోతే మా స్టేషనుకొచ్చి వప్పజెప్పాలని తెలీదురా?”
“ఆరికే ఇచ్చేద్దామని ఆరి ఇంటిక్కూడా ఎల్లాను బాబూ… అక్కడ కుటుంబం ఎవరూ లేరు. ఓపికలేక తెల్లారి లేస్తూనే తమకు వప్పజెప్పేద్దామని బద్దరంగా దాచాను బాబూ!”
“కథలు మా బాగా చెప్తార్రా. దొంగ వెధవా నడువు స్టేషన్కి. అక్కడ చెబుదువు గాని కథలు. అందులో బంగారు నగ వుందనీ, ఆరువేలు డబ్బుందనీ ముందే పసిగట్టి తమాషాగా కొట్టేశావన్నమాట. మా కళ్ళు కప్పలేర్రా నడువు” అని ఓ దెబ్బకొట్టి జబ్బ పట్టుకొని రంగన్నని తోశాడు పెద్ద పోలీసు.
రంగన్న భార్య గోలు గోలున ఏడ్చింది. ఆ పెట్టెలో ఏముందో కూడా తమకు తెలీదని, జరిగిందేమిటో తన భర్త చెప్పాడనీ చెప్పింది. “నేను అబద్ధం చెప్పటం లేదు బాబూ… నిజం చెబుతున్నా… నేను దొంగని కాను, నాకా ఉద్దేశం లేదు. ఇంకొన్ని గంటల్లో నేనే మీకిచ్చేసేవాణ్ణి పెట్టె!” అని రంగన్న ఏడుస్తూ చెబుతున్నా – వినిపించుకోకుండా బరబరా లాక్కుపోతున్నారు పోలీసులు. “నిజం బాబూ! నా మాట నమ్మండి” అని గోలపెడుతున్న రంగన్నని చూసి, చుట్టుపక్కల వాళ్లు ముక్కున వేలేసుకున్నారు. రంగన్న భార్య నెత్తి కొట్టుకుని ఏడుస్తోంది… రంగన్న పోలీసు కాళ్లమీద పడి బతిమాలుకుంటున్నాడు…
రిక్షారంగన్న బలంగా పోలీసు జీపులోకి నెట్టబడ్డాడు. హెడ్లైట్ల వెలుగులో, వింత చూస్తూ కనిపిస్తున్న మనుషుల మధ్య నుంచి జీపు బర్రుమని దూసుకుంది.







