అక్షయ్ కుమారు కూతురికి వేధింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akhsay kumar) కూతురు నిటార కుమార్(Nitara kumar) పై ఆన్లైన్ వేధింపుల కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనలో పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర సైబర్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్(Yashaswi yadav) వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన సైబర్ అవేర్నెస్ మంత్ 2025 కార్యక్రమంలో ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ బయటపెట్టడం సంచలనంగా మారింది. సెలబ్రిటీ కుటుంబానికి చెందిన చిన్నారిపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సైబర్ భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారి తీసింది.
అక్షయ్ కుమార్ వివరాల ప్రకారం, తన 13 ఏళ్ల కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్‌ల ద్వారా ఆమెను సంప్రదించాడు. ప్రారంభంలో సాధారణంగా ప్రారంభమైన సంభాషణ, క్రమంగా అసభ్యపూరితంగా మారి, న్యూడ్ ఫోటోలు పంపాలని ఒత్తిడి చేయడం వరకు వెళ్లింది. అయితే నిటారా భయపడకుండా వెంటనే గేమ్‌ను ఆపేసి, జరిగిన విషయాన్ని తన తల్లికి తెలియజేసింది. కుటుంబం వెంటనే స్పందించి, ఈ అంశాన్ని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం దర్యాప్తుకు కీలకంగా మారింది.
పోలీసులు సాంకేతిక ఆధారాలతో లోతైన దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో అక్షయ్ కుమార్, పిల్లల సైబర్ భద్రతపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని మరోసారి ప్రస్తావించారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు సైబర్ ప్రమాదాలపై శిక్షణ ఇవ్వాలని, వారానికి ఒకసారి ప్రత్యేక సైబర్ అవేర్నెస్ పీరియడ్ నిర్వహణను తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన, డిజిటల్ ప్రపంచంలో చిన్నారుల రక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమని స్పష్టం చేస్తోంది.








