శృతి ఖాతాలో మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్టు
టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న శృతి హాసన్ ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియా, యూకే నేపథ్యంతో తెరకెక్కుతున్న చెన్నై స్టోరీలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చెన్నై నుంచి కార్డిఫ్ వరకు సాగే ఈ సినిమా ద్వారా ఇండియన్ స్టోరీని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు పరిచయం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉండటంతో పాటు తమిళం, వెల్ష్ భాషలకు కూడా కథలో ప్రాధాన్యం ఉండనుంది.
టిమెరి ఎన్. మురారి రచించిన ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. బాఫ్టా అవార్డు విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. చెన్నైకి చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ అనూ చుట్టూ కథ తిరుగుతూ ప్రేమ, పర్సనల్ ఫ్రీడమ్, అంగీకారం వంటి అంశాలను టచ్ చేయనుంది. వివేక్ కల్రా శృతితో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ప్రత్యేకతగా మారింది. కెవిన్ హార్ట్, విన్సెంట్ డియోనోఫ్రియో, జీన్ రెనో, సామ్ వర్తింగ్టన్ వంటి నటుల అనుబంధంతో చెన్నై స్టోరీ పరిధి మరింత విస్తరించింది. గురు ఫిల్మ్స్, రిపుల్ వరల్డ్ పిక్చర్స్, ఐఈ ఐఈ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శృతి మరో అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.








