తొలిసారిగా తన ఓటమిని ఒప్పుకున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా ఇన్నాళ్లూ మొండిగా వ్యవహరించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాస్త దిగొచ్చారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచారని చెప్పారు. తద్వారా తొలిసారిగా తన ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం వల్లే బైడెన్ విజయం సాధించారని ట్రంప్ ఆక్షేపించారు. ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలో మాత్రమే బైడెన్ అధ్యక్షుడిగా నెగ్గాడని ఎద్దేవా చేశారు. చెడ్డ పేరున్న రాడికల్ లెఫ్ట్ కంపెనీ ఓట్ల లెక్కింపు పక్రియలో పాల్గొందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి పరిశీలకులను అనుమతించలేదని తప్పుపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను డెమొక్రాట్లు చోరీ చేశారని మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు.






