Washington: యూఎస్ ఎయిడ్ పునరుద్ధరణ.. ట్రంప్ అనూహ్య నిర్ణయం..!

తగ్గేదే లే అంటూ ఇన్నిరోజులు తొడగొట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఓ విషయంలో మాత్రం వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. వచ్చిన కొన్నిరోజుల్లోనే యూఎస్ ఎయిడ్ లాంటి అత్యంత కీలకమైన పథకానికి నిధులు కట్ చేశారు ట్రంప్. ఆ సంస్థ ఉగ్ర సంస్థ అంటూ ఆరోపించారు. అలాంటి ట్రంప్ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.మళ్లీ ఇప్పుడు దానిని పునరుద్ధరిస్తున్నారు. ఇటీవల 14 దేశాలకు ఆహార సహాయాన్ని నిలిపివేసిన అగ్రరాజ్యం.. పొరపాటున అలా జరిగిందని పేర్కొంది. ప్రపంచ ఆహార కార్యక్రమానికి (WFP) సంబంధించిన మానవతా సహాయ ఒప్పందాలను పునరుద్ధరించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ ఆహార పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా ఇటీవల నిలిపివేసింది. అమెరికా నిర్ణయంపై ప్రపంచంలో అతిపెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే WFP.. తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ‘‘ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుంది. వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారు. ఆకలి చావులు సంభవిస్తాయి’’ అని తన ఎక్స్ పేజీలో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే పథకాలకు సాయంపై ట్రంప్ యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఇప్పటివరకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. కోతల నుంచి ఆహారంతోపాటు ప్రాణాధార అత్యవసర సాయాలను మినహాయిస్తామని గతంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతోపాటు ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం తన సహాయాన్ని పునరుద్ధరించింది.
దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి, ఆ దేశాల అభివృద్ధికి, భద్రతకూ నిధులు సమకూర్చడానికి అమెరికా యూఎస్ ఎయిడ్‌ను నెలకొల్పింది. ఈ సంస్థ ప్రపంచ దేశాలకు వందల కోట్ల డాలర్లను సహాయంగా అందిస్తోంది. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Donald Trump) రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం చేసే వృథా ఖర్చులను తగ్గించడానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్ (DOGE) సంస్థను రూపొందించారు. యూఎస్ ఎయిడ్ (USAID) ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్ ఆరోపించడంతో.. ఆయన సూచనల మేరకు తొలుత కొంతకాలంపాటు యూఎస్‌ఎయిడ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఆ సంస్థలోని వేల మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో ఇన్నాళ్లు యూఎస్ ఎయిడ్‌పై ఆధారపడిన దేశాలపై తీవ్ర ప్రభావం పడింది.