Donald Trump :అమెరికన్లపై ఆదాయపు పన్ను ఉండదు… డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు!

అమెరికా పౌరులపై విధిస్తున్న ఆదాయపు పన్ను (Income tax) రద్దు చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంకేతాలిచ్చారు. ప్రజల వద్ద తగినంత డబ్బులు ఉండి, స్వేచ్ఛగా ఖర్చు చేస్తే ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహం పెరుగుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అమెరికా ప్రజలను ధనవంతులను చేసే వ్యవస్థను పునరుద్ధరించాల్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అమెరికన్లను ధనవంతులు(Rich people)గా, మరింత శక్తివంతులుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాలను బాగు చేయడానికి తమ పౌరులపై పన్నులు వేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. తమ ప్రజలపై పన్నుల భారం వేయడానికి బదులు విదేశాలపై పన్నులు విధించడమే సరైన పద్ధతి అని తేల్చిచెప్పారు.
విదేశాల నుంచి పన్నులు వసూలు చేయడానికి ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీసు (External Revenue Service)ను ప్రారంభించినట్లు ట్రంప్ వెల్లడిరచారు. అమెరికా చరిత్రలో 1870 నుంచి 1913 మధ్య ప్రజలు సంపన్నులుగా ఉండేవారని గుర్తు చేశారు. అప్పట్లో సుంకాల ఆధారిత వ్యవస్థ ఉండేదని అన్నారు. దిగుమతి చేసుకొనే వస్తువులపై విధించే సుంకాలతో భారీగా ఆదాయం వచ్చేదన్నారు. అందుకే ఇప్పుడు అమెరికా వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలని స్పష్టం చేశారు.