అమెరికాకు కొత్త రోజులు : కమలా హ్యారిస్
ఎన్నికల్లో తాను సాధించిన విజయం మహిళా లోకం సాధించిన గెలుపుగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ అభివర్ణించారు. తాను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం తన తల్లి శ్యామలా గోపాలన్ ఇచ్చిన స్పూర్తేనని ఆమె గుర్తు చేసుకున్నారు. విల్మింగ్టన్లో నిర్వహించిన విజయోత్సవ సభలో కమల ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. అమెరికాకు కొత్త రోజులు రాబోతున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, జాతి వివక్షను రూపుమాపడం వంటి విషయాల్లో అసలైన పని ఇప్పుడే మొదలుకాబోతున్నదని తెలిపారు. ముందున్న మార్గం అంత సులువైందేమీకాదని, అయితే, దేనికైనా అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి తొలి మహిళనైనా.. చివరి మహిళను మాత్రం కాబోనని అన్నారు.






