ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకారి : జో బైడెన్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరుగుబాటును రెచ్చగొట్టి, దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో జరిగిన ఆర్థిక సంబంధ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా బైడెన్ మీడియాతో మాట్లాడారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ మోసంతో గెలిచారని ఆరోపిస్తున్న ట్రంప్ సదరు ఎన్నికకు వ్యతిరేకంగా 2021 జనవరి 6న అమెరికా కాంగ్రెస్ పై జరిగిన దాడిని ఇప్పటికీ సమర్థిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ఆ దాడిలో పాల్గొన్నవారిపై కేసులు ఎత్తివేస్తానని ప్రకటించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ మళ్లీ తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.






