ఆ స్వేచ్ఛ భారత్ కు ఉంది.. అమెరికా కీలక వ్యాఖ్యలు
అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అయినప్పటికీ నిర్దిష్ట అంశాలపై తన వైఖరిని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అగ్రరాజ్యం వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్త్రిక్తతల్లోనూ ఎలాంటి వైఖరి అనుసరించాలన్నది పూర్తిగా భారత్ ఇష్టమేనని తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం కీలక ప్రతినిధి జాన్ కిర్బీ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించాలని అమెరికా భావిస్తోందా? అని వైట్‌హౌస్ జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ అమెరికాకు భారత్ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి. ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు (అమెరికా పర్యటనకు) వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య బంధాన్ని మీరు చూసే ఉంటారు. అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సంక్షోభ పరిస్థితులు నెలకొంటే దానిపై భారత్ వైఖరి ఏంటో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ ఆ దేశానికి ఉంటుంది. ఆ దేశం మాకు ఎప్పటికీ వ్యూహాత్మక భాగస్వామే. ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేం అంకితభావంతో ఉన్నాం అని వెల్లడిరచారు.






