దయచేసి వ్యాక్సిన్ వేయించుకోండి.. పౌరులకు మాజీ అధ్యక్షులు, ప్రథమ మహిళల వినతి
వాషింగ్టన్ః కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రాగానే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని నలుగురు మాజీ అధ్యక్షులు, ప్రథమ మహిళలు అమెరికన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొందరు అమెరికన్లు సందేహిస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఈ విజ్ఞప్తి చేశారు.
ఇటీవలే కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్, ప్రథమ మహిళలు మిషెల్ ఒబామా, లారా బుష్, హిల్లరీ క్లింటన్, రోజాలిన్ కార్టర్లు రెండు వీడియో ప్రకటనల ద్వారా దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వారు ఓ 60 సెకండ్ల వీడియోలను ఈ సందర్భంగా విడుదల చేశారు. దేశం నుంచి వైరస్ సాధ్యమైనంత త్వరగా నిష్క్రమించాలని తామంతా కోరుకుంటున్నట్టు వారు ఆ వీడియోల్లో చెప్పారు.
‘‘నా పనులు నేను మళ్లీ ప్రారంభించాలి. స్వేచ్ఛగా తిరగాలి’’ అని 74 ఏళ్ల క్లింటన్ అన్నారు. ‘‘నేను మా అత్తగారి పుట్టిన రోజు నాడు కుటుంబ సమేతంగా ఆమె దగ్గరకు వెళదామనుకుంటున్నాను’’ అని 59 ఏళ్ల ఒబామా తెలిపారు. ‘‘టెక్సాస్ రేంజర్స్ స్టేడియమ్‌ను ప్రారంభించే రోజున అక్కడికి వెడదామని ఉంది’’ అని 74 ఏళ్ల బుష్ చెప్పారు. ఈ వైరస్ సాధ్యమైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలను ఉద్దేశంతో తాను ముందుగానే వ్యాక్సిన్ వేయించుకున్నట్టు 96 ఏళ్ల కార్టర్ తెలిపారు.
ఈ వీడియోలలో మాజీ అధ్యక్షులు, వారి భార్యలు సిరెంజీలు చేతబట్టుకుని కనిపించారు. ‘‘ప్రజలంతా చొక్కాలు పైకి మడతపెట్టి వ్యాక్సిన్లు వేయించుకోవాలి’’ అని వారు ఆ వీడియోల్లో అభ్యర్థించారు. మరో 30 సెకన్ల యాడ్ వీడియోను కూడా రూపొందించారు. క్లింటన్, ఒబామా, బుష్‌లు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తున్నట్టు అందులో కనిపించింది.
‘‘ఈ ప్రాణాంతక వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ మిమ్మల్ని, మిమ్మల్ని ప్రేమించినవారిని కాపాడుతుంది’’ అని బుష్ అన్నారు. ‘‘వైరస్‌ను దేశం నుంచి వెళ్లగొట్టడానికి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ వ్యాక్సినేషన్ మొదటి అడుగు’’ అని ఒబామా అన్నారు.
దేశంలో వ్యాక్సిన్ సరఫరాను బాగా పెంచుతున్నప్పటికీ కొందరు పౌరులు లేనిపోని భయాలతో వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ వీడియోలు విడుదలయ్యాయి. ఇటువంటి ధోరణి దేశానికి తీవ్ర అభివృద్ధి నిరోధకంగా తయారవుతుందని వారు భావిస్తున్నారు.






