సోషల్ మీడియాకు డొనాల్డ్ ట్రంప్.. గుడ్ బై

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాను శాశ్వతంగా మూసివేశారు. ఫేస్‍బుక్, ట్విట్టర్‍లతో సహా సామాజిక మాధ్యమాలన్నీ నిషేధించడంతో ఆయన ఈ చర్య తీసుకున్నారు. ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె.ట్రంప్ అన్న శీర్షికతో వుండే బ్లాగ్ ప్రారంభించిన నెల రోజులకే ట్రంప్ మూసివేసినట్లు ఆయన సీనియర్ సహాయకుడు జేసన్ మిల్లర్ తెలిపారు. తాము తీసుకుంటున్న విస్త•త చర్యలకు అనుబంధంగా ఈ చర్య తీసుకున్నామన్నారు. అయితే త్వరలోనే వాటికి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వగలమని ఆశిస్తున్నట్లు తెలిపారు.
వేరే సోషల్ మీడియా వేదికలో చేరడానికి ఇదొక సంకేతమా అని ప్రశ్నించగా కచ్చితంగా అని మిల్లర్ బదులిచ్చారు. తన పట్ల రాజకీయ పక్షపాతం ప్రదర్శిస్తున్నారని, తన సంభాషణలను సెన్సార్ చేస్తున్నారని ట్రంప్ ఫేస్‍బుక్, ట్విట్టర్‍తో సహా సామాజిక మాధ్యమాలపై దీర్ఘకాలంగా విరుచుకుపడుతున్నారు. ఫేస్‍బుక్, ఇన్‍స్టాగ్రామ్‍తో సహా ఇతర సంస్థలన్నీ ట్రంప్ ఖాతాను నిషేధించాయి. జనవరి 6న కేపిటల్‍పై దాడి చేసేలా తన మద్దతుదారులను రెచ్చగొడుతూ ఆయన ప్రసంగాలు చేశారని, హింసకు ప్రేరేపించారని ఆ సంస్థలు పేర్కొన్నాయి.