ఎలోన్ మస్క్‌తో తన ‘ప్రధాన ఇంటర్వ్యూ’ని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అటు డెమోక్రటిక్, ఇటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ర్యాలీలు చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరంపరలో వివిధ టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రముఖులతో చర్చిస్తూ తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కీలక విషయం వెల్లడించారు. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తనని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. బుధవారం ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మస్క్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఇంటర్వ్యూ ఎక్స్‌లో ప్రసారమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






