హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం సెక్రటరీ వోల్ఫ్ రాజీనామా
అమెరికాలో హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం యాక్టింగ్ సెక్రటరీ చాడ్ వోల్ఫ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మరిన్ని ఆందోళనలు చెలరేగవచ్చన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనవరి 20న జరిగే ఈ వేడుకకు వోల్ఫ్ భద్రత బాధ్యతలు నిర్వహించాల్సి వుంది. అయితే తాను పదవీవిరమణ చేయనున్నట్లు ఒక లేఖలో పేర్కొన్నారని డిహెచ్ఎస్ సిబ్బంది తెలిపారు. గతవారం కాపిటల్ భవనంపై దాడి అనంతరం ఈ ప్రకటనతో ట్రంప్ మంత్రివర్గంలో రాజీనామా చేసిన మూడో వ్యక్తిగా చాడ్ వోల్ఫ్ నిలిచారు.
డొనాల్డ్ ట్రంప్‌కు వోల్ఫ్ అత్యంత సన్నిహితుడు. కాపిటల్ భవనంపై దాడి ఘటన విషాదాంతమని, ఈ పరిస్థితులు అనారోగ్యకరమని పేర్కొంటూ మరుసటి రోజు వోల్ఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ట్రంప్ మద్దతుదారులు హింసను సాధనంగా వినియోగించడం చూస్తున్నామని, అయితే రాజకీయ హింసను తాను ఖండించానని అన్నారు. అయితే ట్రంప్ పాలన ముగిసే వరకే తాను పదవిలో ఉంటానని గతవారం వోల్ఫ్ ప్రకటించడం గమనార్హం.






