డెమోక్రాట్లకు మెజారిటీ కట్టబెడితే.. తుపాకుల పని
తుపాకులను పార్లమెంటు సభ్యులు కట్టడి చేయకపోతే వచ్చే నవంబరు మధ్యంతర ఎన్నికల్లో ప్రజలే తమ ఓటుతో వాటిని నియంత్రించాలి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. నవంబరు ఎన్నికల్లో ఉభయ సభల్లో డెమోక్రాట్లకు ఓటర్లు మెజారిటీ కట్టబెడితే తుపాకుల పని పడతాని బైడెన్ తెలిపారు. అమెరికాలో తుపాకులను కూరగాయల్లా కొనే సౌలభ్యం ఉండటంతో అవాంఛనీయ శక్తులు పాఠశాలల్లో, సూపర్ మార్కెట్లలో, ఇతర బహిరంగ స్థలాల్లో విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతున్నాయి. దీన్ని నిరోధించేందుకు సైనికులు వాడే ఎస్టాల్ రైఫిల్స్, ఎక్కువ తూటాలు ఉండే పట్టీలను మైనర్లకు విక్రయించకుండా నిషేధం విధిస్తూ చట్టం చేయాలని కాంగ్రెస్ సభ్యులు బైడెన్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. తన ప్రతిపాదన ఆమోదనీయం కాకపోతే కనీసం మానసిక సమస్యలున్న వారికైనా తుపాకులను విక్రయించకుండా నిరోధించాలని ఆయన సూచించారు.
ఈ ఏడాది నవంబరు 8న కాంగ్రెస్ దిగువసభ అయిన ప్రజా ప్రతినిధుల సభలోని మొత్తం 435 సీట్లకూ, సెనెట్‌లోని 100 సీట్లలో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల సభలో పాలక డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ ఉండగా, సెనెట్‌లో మాత్రం విపక్ష రిపబ్లికన్లకు, అధికార డెమోక్రాట్లకు చెరి 50 సీట్లు ఉన్నాయి.






