డొనాల్డ్ ట్రంప్ నాకు లేఖ రాసి వెళ్లారు
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఓ ఉదాత్తమైన లేఖ రాసి వెళ్లినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. వైట్‌హౌజ్‌లోని ఓవల్ ఆఫీసులో ఆ లేఖను అందుకున్నట్లు బైడెన్ చెప్పారు. 46వ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. ఆ తర్వాత ఓవల్ ఆఫీసు చేరుకున్నారు. సాంప్రదాయం ప్రకారం బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట అధ్యక్షులు.. కొత్తగా ఎనుకున్న అధ్యక్షులకు లేఖ రాస్తారు. ట్రంప్ రాసిన ఆ లేఖ సౌమ్యంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు. కానీ ఆ లేఖలో ఉన్న వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. అధ్యక్షుడు ట్రంప్ తనకో లేఖ రాశారని, దాని గురించి తానేమీ చెప్పదలుచుకోలేదని, ఎందుకంటే అది ప్రైవేటు విషయమని, ఆయనతో మాట్లాడేంత వరకు ఆ లేఖ గురించి ఏమీ చెప్పనని, కానీ లేఖలో సారాంశం మాత్రం ఉదారంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఓవల్ ఆఫీసులోని రిజల్యూట్ డెస్క్‌లో ట్రంప్ ఆ లేఖను వదిలివెళ్లినట్లు అధ్యక్షుడి ప్రతినిధి ఒకరు తెలిపారు. మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు లేఖ రాశారు.






