వైభవ్ సూర్యవంశీకి క్లీన్ చిట్, ఫోన్ వివాదంలో ఊరట..!
ఐపీఎల్ 2026(IPL) సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (RR) మేనేజర్ రోమీ భిందర్ నిబంధనల ఉల్లంఘన కేసులో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి భారీ ఊరట లభించింది. ఏప్రిల్ 11న గువహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(RCB) జరిగిన మ్యాచ్ సందర్భంగా డగౌట్లో ఫోన్ వాడిన ఘటనపై విచారణ జరిపిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU), సూర్యవంశీని నిర్దోషిగా తేల్చింది. ఈ ఘటన జరిగినప్పుడు సూర్యవంశీ కేవలం రోమీ భిందర్ పక్కనే కూర్చుని ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ కనిపించాడు.
సూర్యవంశీ స్వయంగా ఫోన్ వాడలేదని, కేవలం పక్కన కూర్చున్న వ్యక్తి ఫోన్ చూస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా అటువైపు చూశాడని విచారణలో తేలింది. 15 ఏళ్ల సూర్యవంశీకి లీగ్ నిబంధనలపై పూర్తి అవగాహన లేకపోవచ్చని, అతనికి నిబంధనలను వివరించాల్సిన బాధ్యత ఫ్రాంచైజీదేనని బీసీసీఐ భావించింది. ఎటువంటి అవినీతి లేదా సమాచార బదిలీకి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో సూర్యవంశీకి క్లీన్ చిట్ ఇచ్చారు. మరోవైపు, నిబంధనలను ఉల్లంఘించిన టీమ్ మేనేజర్ రోమీ భిందర్పై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
డగౌట్లో ఫోన్ వాడినందుకు అతనికి లక్ష రూపాయల జరిమానా విధించింది. ఇది మొదటి తప్పు కావడంతో జరిమానాతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా హెచ్చరించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, టీమ్ మేనేజర్లు అత్యవసర పరిస్థితుల్లో డ్రెస్సింగ్ రూమ్లో మొబైల్ ఫోన్లు వాడుకోవచ్చు. కానీ, మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో (Dugout) మొబైల్ ఫోన్ వాడటం పూర్తిగా నిషేధం. మొత్తానికి ఈ వివాదం నుంచి సూర్యవంశీ సురక్షితంగా బయటపడటంతో రాజస్థాన్ రాయల్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.








