T20 World Cup 2026: టోర్నీలో నమోదైన సంచలన రికార్డులు, గణాంకాలు ఇవే!
న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత (T20 World Cup 2026) ఫైనల్ పోరులో అద్భుత సమష్టి కృషితో సత్తా చాటిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ 2026ను సగర్వంగా ముద్దాడింది. ఆటగాళ్ల వీరోచిత పోరాటాలు, అనూహ్య మలుపులతో సాగిన ఈ మెగా టోర్నీలో బ్యాటర్ల విధ్వంసాలు, బౌలర్ల మ్యాజిక్‌లు ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించాయి. టోర్నీ ఆద్యంతం అదరగొట్టి, వివిధ విభాగాల్లో టాప్‌గా నిలిచిన ఆటగాళ్లు, జట్ల పూర్తి గణాంకాల విశ్లేషణ ఇక్కడ చూద్దాం.
బ్యాటింగ్‌లో దద్దరిల్లిన రికార్డులు
అత్యధిక పరుగులు & ఫోర్లు: ఈ టోర్నీలో (T20 World Cup 2026) పరుగుల వరద పారించిన ఘనత పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు దక్కింది. అతడు ఆడిన 7 మ్యాచుల్లో 383 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా, అత్యధికంగా 37 ఫోర్లు బాదాడు.
వ్యక్తిగత గరిష్ట స్కోరు: ఒక మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును కెనడా ప్లేయర్ యువరాజ్ సమ్రా (110 పరుగులు) తన పేరిట లిఖించుకున్నాడు.
సిక్సర్ల కింగ్: కేవలం 5 మ్యాచ్‌లే ఆడిన భారత ఓపెనర్ సంజు శాంసన్ ఏకంగా 24 సిక్సర్లు బాది, టోర్నీలోనే (T20 World Cup 2026) అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా సత్తా చాటాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ & స్ట్రైక్ రేట్: న్యూజిలాండ్ విధ్వంసక ఆటగాడు ఫిన్ అలెన్ దక్షిణాఫ్రికాపై కేవలం 33 బంతుల్లోనే శతకం బాది ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. టోర్నీలో 100కు పైగా పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ (200) కూడా అలెన్‌దే కావడం విశేషం.
ఇవి కూడా చదవండి
అత్యధిక హాఫ్ సెంచరీలు: కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 4 అర్ధ శతకాలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
బెస్ట్ యావరేజ్: జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ అద్భుతమైన నిలకడ కనబరుస్తూ 146 సగటుతో ఆకట్టుకున్నాడు.
బౌలింగ్, ఫీల్డింగ్ మెరుపులు
వికెట్ల వేటలో బుమ్రా: భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. 8 మ్యాచుల్లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టి టోర్నీలో (T20 World Cup 2026) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
డాట్ బాల్స్ స్పెషలిస్ట్: ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పొదుపైన బౌలింగ్‌తో బ్యాటర్లను కట్టడి చేశాడు. టోర్నీలో (T20 World Cup 2026) అత్యధికంగా 86 డాట్ బాల్స్ వేశాడు.
క్యాచ్‌ల వీరుడు: మైదానంలో పాదరసంలా కదిలిన న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ అత్యధికంగా 11 క్యాచ్‌లు అందుకున్నాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జట్ల ఆధిపత్యం.. భారీ విజయాలు
టీమిండియా విజయ పరంపర: ఈ టోర్నీలో (T20 World Cup 2026) భారత్ ఆడిన 9 మ్యాచుల్లో ఏకంగా 8 విజయాలు సాధించి, 88.9% గెలుపు శాతంతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
అతిపెద్ద విజయాలు: వికెట్ల పరంగా చూస్తే యూఏఈపై న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. పరుగుల పరంగా జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.








