Virat Kohli: కోహ్లీతో ఆర్సీబీ చర్చలు.. రీజన్ అదేనా..?
2026 ఐపిఎల్ సీజన్ ప్రారంభానికి ముందే.. పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఐపీఎల్(IPL) చరిత్రలోనే భారీ ధరకు.. రూ. 16,700 కోట్లకు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం మారిన నేపథ్యంలో, అందరి దృష్టి ఇప్పుడు ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పైనే పడింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కొత్త కన్సార్టియం బాధ్యతలు చేపట్టిన వెంటనే, విరాట్ కోహ్లీతో చర్చలు జరపాలని నిర్ణయించుకుంది. ఆర్సిబి అంటేనే విరాట్ కోహ్లీ అనే బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేపధ్యంలో.. జట్టు భవిష్యత్తు ప్రణాళికలను కోహ్లీతో పంచుకోవాలని యాజమాన్యం భావిస్తోంది.
గత 18 సీజన్లుగా ఆర్సిబి జట్టుకు వెన్నెముకగా నిలిచిన కోహ్లీ, కొత్త యాజమాన్యంతో కలిసి జట్టును మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్త యజమానులు కోహ్లీని కేవలం ఒక ఆటగాడిగానే కాకుండా, జట్టును బలోపేతం చేసే.. ఒక ఐకాన్‌గా చూస్తున్నారు. కోహ్లీ.. ఆలోచనలకు అనుగుణంగా జట్టులో మార్పులు చేస్తామని, ముఖ్యంగా టైటిల్ వేటలో కోహ్లీ అనుభవాన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటామని కొత్త బోర్డు సభ్యులు స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఈ చర్చలు జరగడం విశేషం.
ప్రస్తుతం కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఆర్సిబికి అతిపెద్ద సానుకూలాంశం. ప్రాక్టీస్ సెషన్లలో కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలు చూస్తుంటే, ఈ సీజన్లో పరుగుల వరద పారించడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త యాజమాన్యం రాకతో కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుందని, ఆయన మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఆర్సిబిలో కొత్త శకం మొదలైనప్పటికీ విరాట్ కోహ్లీ ఆ జట్టుకు ఎంతో కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రజత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ ఆడుతోంది.








