“వెంటనే వేగంగా పెరిగిపోయేది అదొక్కటే” – ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
అక్టోబర్ 17 నాడు హైదరాబాద్ దసపల్లా హోటల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్య చేసి సభికులందర్నీ సంభ్రమాలోచనల్లో పడేశారు.
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
“తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వెంకన్న తన అంగవైకల్యాన్ని అధిగమించి, అర ఎకరం పొలాన్ని అర్థశతాబ్ది కాలంలో వందెకరాల – దేశం గర్వించదగిన అతి పెద్ద – నర్సరీగా అభివృద్ధి చేసిన తీరు, దేశం లో ప్రతి ఇల్లు ఆక్సిజన్ని సమృద్ధిగా అందించే పచ్చటి మొక్కలతో విరాజిల్లాలని తపించి చేసిన కృషి అసాధారణమైనవి. యువతకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి వ్యక్తి విజయ గాథని ‘ఎమెస్కో’ ప్రచురించటం అభినందనీయం…. పాతికేళ్ళు పెంచిన కొడుకు తల్లిదండ్రుల పట్ల తన ఋణం తీర్చుకుంటాడో లేడో గాని, మీరు నాటిన పండ్ల మొక్క నాలుగైదేళ్ళ వయసునుంచే ఋణం తీర్చుకోవటం ప్రారంభిస్తుంది; అది తన జీవితకాలం ఆ పని చేస్తూనే ఉంటుంది – అని నమ్మి, అదే తత్త్వాన్ని ప్రచారం చేశారు వెంకన్న…”
ఇలా చెబుతూ వెంకయ్య నాయుడు ఇంకో మాట చెప్పారు. “ఇంత గొప్ప పండ్ల మొక్కని వెంకన్న నర్సరీనుంచి తెచ్చుకొని, పాతి, ‘వేగంగా పెరిగి, ఫలితం ఇవ్వు’ అంటే ఇవ్వదు. పుట్టిన వెంటనే వేగంగా పెరిగేది మొక్క కాదు అప్పు. అది పుట్టిన మరుక్షణం నుంచే పెరిగిపోతూ ఉంటుంది. దానికి ఆదివారాలూ లేవు, శలవులూ లేవు, పండగలూ లేవు……”
ఈ పుస్తకం ఇంగ్లీషులో కూడా రావాలని, ఇది దేశమంతా ప్రచారంలోకి రావాలని కోరుకుంటున్నాను అని కూడా అన్నారు. ఒకప్పుడు మోడువారిన నేలలా ఉండే తెలంగాణలో ఇప్పుడు పచ్చదనం వెల్లి విరుస్తోందని అభినందించారు.
ఈ పుస్తక రచయిత వల్లీశ్వర్, పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణకుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బి.వి.పట్టాభిరాం, పల్ల వెంకన్న కుమారుడు సుబ్రహ్మణ్యం, నర్సరీమెన్ జాతీయ అధ్యక్షులు వై.పి.సింహ్, ‘ఎమెస్కో’ విజయకుమార్ ప్రసంగించారు.
తెలంగాణ హోం శాఖా మంత్రి మహమ్మదాలీ కూడా పాల్గొన్నారు.













