మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు చేసిన తుమ్మల
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను. అరాచక, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సొదరులు ఆలోచన చేయాలి అని కామెంట్ చేశారు.
మంత్రి అజయ్ కుమార్‌ను కాశీం రజ్వీతో పోల్చారు. తాను మంత్రిగా ఉన్నపుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారు కానీ, ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్ తీసుకువచ్చి నాకు చెబుతున్నారు. మంత్రిగా అజయ్ కుమార్ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైరయ్యారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే మనందరికీ సిగ్గుచేటు. చిన్నతనం నుంచే పోరాడేతత్వం నాది. ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడాను అంటూ వ్యాఖ్యలు చేశారు.













