తెలంగాణ భవన్ లో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
టీఆర్ఎస్ 18వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మే 23న వచ్చే ఫలితాల్లో టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పనిచేసిన తెలంగాణవాదులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాస్ట్రం ఏర్పడుతుదని.. ఆనాడు కేసీఆర్ మూడు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో దిగారు. డిప్యూటీ స్పీకర్ పదవికీ, శాసన సభ సభ్యత్వానికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమానికి కేసీఆర్ పురుడు పోశారు. ఉద్యమం ప్రారంభించిన అనంతరం ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన ధైర్యం కేసీఆర్‌ది. ఉద్యమ తొలినాళ్లలో అన్ని ప్రతికూల పరిస్థితులే. 13 ఏళ్లు పోరాటం చేసి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారు. తక్కువ కాలంలో ప్రత్యేక రాష్ట్రం సాధించినందుకు కేసీఆర్‌ను నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ఈ 18 ఏళ్ల తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఎదిగింది అని కేటీఆర్ అన్నారు.













