అమెరికాకు టీజేఏసీ చైర్మన్
టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లారు. అయితే ఇది కేవల కోదండరామ్ వ్యక్తిగ పర్యటన మాత్రమేనని టీజేఏసీ వర్గీయులు తెలిపారు. ఆయన బంధువులకు సంబంధించిన వారి పెండ్లి ఉండడంతో అమెరికాకు వెళ్తున్నారని, అక్కడ ఎలాంటి రాజకీయ సమావేశాలు ఉండబోవన్నారు. ఉండేది వారం రోజులే అయినందున, ఎవరినీ కలిసే అవకాశం లేదన్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కడం, రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం, మార్చి రెండోవారంలో పార్టీని ప్రారంభించబోతున్న క్రమంలో ఆయన అమెరికాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని ప్రారంభించబోతున్న రోజే తన పార్టీకి చెందిన పేరును, గుర్తును, విధివిధానాలను కోదండరామ్ ప్రకటించనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.
అమెరికా పర్యటనలో ఎన్ఆర్ఐలతో కోదండరామ్ సమవేశం కానున్నట్టు తెలిసింది. ఎన్ఆర్ఐల మద్దతు కోరనున్నారు. వారి సహాయంతో రాష్ట్రంలోకి కొంతమంది నేతలను తమ వైపుకు తిప్పుకుంటారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన చాలామంది అమెరికాలో ఉండటం, వారిలో ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్‌కు మద్దతు ప్రకటించారు. వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఎక్కువమంది ఎన్ఆర్ఐలను కలుసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలకు చెందిన నేతలు, అధికారపార్టీలోని కొంతమంది అసంతృప్తి నేతలు కోదండరామ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. కోదండరామ్ అమెరికాకు వెళ్లడానికి ముందు పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 200 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వంద మంది టీజేఏసీ చెందిన వారు కాగా, మరో వందమంది బయటవారిని తీసుకుంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అమెరికాకు నుండి వచ్చిన తర్వాత కోదండరామ్ వారందరితో సన్నాహాక మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీజేఏసీ నేతలు తెలిపారు.













