కేంద్రంపై మండిపడ్డ తెలంగాణ మంత్రి కేటీఆర్…. కౌంటర్ ఇచ్చిన తెలంగాణ బీజేపీ శాఖ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన నేపథ్యంలో వచ్చిన విమర్శలపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కె. తారక రామారావు ఘాటుగానే స్పందించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తాము మద్దతిస్తే ఏపీ విషయాలు మీకెందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో లేదా? అని సూటిగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కును తుక్కు చేసి కేంద్రం అమ్మేస్తోందని, ఇవాళ విశాఖ ఉక్కుపై పడ్డారని, రేపు సింగరేణిని కూడా ప్రైవేట్‌పరం చేస్తామంటారని వ్యాఖ్యానించారు. ఏపీ విషయంలో తాము నోరు మూసుకొని కూర్చోమని, రేపు తెలంగాణపై కేంద్రం పడితే తమకు ఎవరు మద్దతిస్తారని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందేమోనని ఆయన ఎద్దేవా చేశారు. తామంతా మొదట భారతీయులమని, ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలమని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో టీఆర్ఎస్ వద్ద మనీ పవర్ లేదని, మజిల్ పవర్‌తో పాటు మీడియా పవర్ కూడా లేదన్నారు. ఈ శక్తులన్నింటినీ ఒంటిచేత్తో ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేటీఆర్ వివరించారు. చెన్నారెడ్డి లాంటి వారే తెలంగాణను సాధించలేదు, మీవల్ల ఏమవుతుందని కొందరు అన్నారని, ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట కొందరే నడిచారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ వద్ద అప్పట్లో ఏ బలమూ లేదని, కేవలం మేధో సంపత్తితోనే తెలంగాణ సిద్ధించిందని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివాదాలకు వెళ్లకుండా పూర్తిగా అభివృద్ధిపైనే కేంద్రీకృతమయ్యాని వివరించారు.
మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన బీజేపీ
అజంజాహి మిల్ గురించి, నిజాం షుగర్ సంగతి ఏంటో మొదట ప్రభుత్వం వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న సమస్యలను విడిచి పెట్టి, పక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టిసారిస్తున్నారని, మొదట తెలంగాణ సమస్యల విషయంపై టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఎన్నికలు రాగానే మంత్రి కేటీఆర్‌కు పూనకం వస్తుందని ఎద్దేవా చేశారు. బాధ్యతా రాహిత్యంగా కేంద్రంపై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ డీఎస్సీ ఎందుకు వేయలేదు, టీచర్ల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టే, కేంద్రంపై విరుచుకుపడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.













