జూలై 20 వరకు కోర్టులకు లాక్డౌన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో హైకోర్టు, కింది కోర్టుల రోజువారీ కార్యక్రమాల రద్దును జూలై 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలో పుల్ కోర్టు సమావేశమై జూలై 20 వరకు అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని నిర్ణయించింది. హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రిబ్యునల్స్, లీగల్ సర్వీస్ అథారిటీ, ఆర్బిట్రేషన్ సెంటర్స్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తదితర అన్ని న్యాయ సంస్థల్లో వచ్చే నెల 20 వరకు లాక్డౌన్ నిబంధనల అమలును పొడిగించాలని సమావేశం తీర్మానించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.













