కబ్జా కూడా ప్రజాసేవేనా?
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవకోసం భూమిని కబ్జా చేశానంటూ నిర్లజ్జగా ప్రకటించేశారు. చేర్యాల చెరువు శిఖం భూములు కబ్జా చేసినట్లు అంగీకరించారు. ప్రజాసేవకు కావాల్సిన నిర్మాణాలకు భూమి కావాలని అందుకే దాన్ని కబ్జా చేశానన్నారు. అంతే కాదు… చేసిన కబ్జాను సైతం పబ్లిగ్గా అంగీకరించారు. దీంతో ఇన్నాళ్లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై వస్తున్న కబ్జాల ఆరోపణలు నిజమేనని తేలినట్లైంది.
రాజకీయ ప్రత్యర్థులు, ప్రజలు, ప్రజాసంఘాల నేతలు… ముత్తిరెడ్డి కబ్జాలపై ఎన్నోసార్లు మొత్తుకున్నారు. మీడియాకెక్కారు. ప్రకటనలు చేశారు. అయినా ముత్తిరెడ్డి ఏమాత్రం చలించలేదు. అంతేకాదు.. బీఆర్ఎస్ హైకమాండ్ అండ చూసుకుని … అవినీతి పర్వాన్ని కొనసాగించారు.అయితే సాక్షాత్తూ బిడ్డే.. ముత్తిరెడ్డిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో.. ఎమ్మెల్యేకు గొంతులో వెలక్కాయ పడ్డట్లైంది. అంతేకాదు.. మానాన్న ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టడం తప్పని ప్రకటన కూడా విడుదల చేసింది. ఆభూమిని తిరిగి మున్సిపాలిటీకి ఇస్తున్నట్లు ప్రకటించింది.
ప్రజాసేవ కోసమే భూమిని కబ్జా చేశాను అని చెప్పిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కూతురు తుల్జా భవాని ఈ భూమిని తిరిగి మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తెను అడ్డుపెట్టుకొని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు.స్థలాలను కబ్జా చేసింది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అని, ఆయనకు దమ్ముంటే కబ్జా చేసిన భూములు వెంటనే మున్సిపాలిటీకి అప్పగించాలని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు. తనకూతురు, అల్లుడు అమాయకులని, వారిని మిస్ గైడ్ చేస్తున్నారని ఆరోపించారు.
సాక్షాత్తూ ప్రజాప్రతినిధి భూకబ్జా చేయడం సహించరాని నేరం. అందునా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు తక్షణం.. చర్యలు తీసుకోవాలి. అయితే…ఇంత జరిగినా బీఆర్ఎస్ హైకమాండ్ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవును చెరువు శిఖం భూములు కబ్జా చేశానని సాక్షాత్తూ ఎమ్మెల్యే ప్రకటించినా… ఎందుకు గులాబీ అధిష్టానం స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీటి వెనక అందరికీ వాటాలుండబట్టే .. స్పందన కనిపించడం లేదని విపక్షనేతలు ఆరోపిస్తున్నారు. అదే ఇంకోపార్టీ అయితే కనీసం సస్పెండ్ అయినా చేసుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













