24న ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం
మైట్రో రైలు ఇక ఎల్బీనగర్ వరకూ దూసుకెళ్లనుంది. ఎప్పుడెప్పుడా అని నగరవాసులు ఎదురుచూస్తునన అమీర్పేట-ఎల్బీనగర్ మార్గం ప్రారంభానికి సిద్దమైంది. ఈ నెల 24న మధ్యాహ్నం 12:15 గంటలకు దీన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్, సీఎస్ జోషీ, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. నగరంలో గత ఏడాది నవంబరు 28న ప్రధాని మోదీ తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్టును 30 కి.మీ. పరిధిలో మియాపూర్, నాగోల్ మధ్యలో ప్రారంభించారు. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం సరాసరిగా 1.20 లక్షల వరకు ఉంది. నగరంలో మూడు కారిడార్ల ద్వారా మెట్రో రైలు నడుస్తుండగా, మియాపూర్-అమీర్పేట-ఎల్బీనగర్ కారిడార్-1 అతి పెద్దది.













