సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన
సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్ సూర్యపేటలో పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్లో స్థానిక ఎస్వీ కళాశాల ప్రాంగణంలో దిగిన వీరికి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ స్వాగతం పలికారు. అనంతరం కరోనా కేసులు అధికంగా నమోదైన సూర్యాపేట కూరగాయాల మార్కెట్‌ను సందర్శించారు. కరోనా కట్టడికి క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టరేట్లో కరోనా నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు క్వారంటైన్ కేంద్రాల్లో 210 మంది ఉండగా, దాదాపు 4,346 మంది గృహనిర్బంధంలో ఉన్నారు.













