తెలంగాణ అబ్బాయితో అమెరికా అమ్మాయి పెళ్ళి
మన స్వదేశీ అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను వలచి వరించటం కొత్తేమీ కాకపోయినా ప్రస్తుత కరోనా క్రైసిస్‌లో ఇలాంటి ఖండాంతర వివాహం జరగటాన్ని ప్రత్కేక విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఒక ఖండాంతర, మతాంతర కులాంతర వివాహం భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకు అమెరికాలోని సౌత్ కరోలినాలో జరగనుంది. సూపర్ స్టార్ కృష్ణ-శ్రీమతి విజయనిర్మల కాంబినేషన్లో పి.సి.రెడ్డి దర్శకత్వంలో అన్నయ్య అనే 500 ఏపిసొడ్స్ మెగా టీవీ సీరియల్‌తో పాటు టాలీవుడ్లో పలు తెలుగు చిత్రాలు నిర్మించి, వందలాది చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రొడ్యూసర్ కమ్ ఫైనాన్సియర్ సోమా విజయ ప్రకాష్-సోమా జ్యోతిల తనయుడు సోమా వినీత్ వివాహం అమెరికా వాస్తవ్యులు మిస్టర్ మిస్సెస్ అలన్ ఎ.రస్సెన్ కుమార్తె కైత్లిన్తో జరగనుంది.
వాస్తవానికి వీరి వివాహాన్ని గత మే 22న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు నిర్మాత సోమా విజయ ప్రకాష్, కానీ కరోనా అవరోధం కారణంగా అది సాధ్యపడకపోవటంతో కేవలం పది పన్నెండు మంది స్థానిక అతిథుల సమక్షంలో జరుగుతున్న వివాహాన్ని హైదరాబాద్ నుండి లైవ్‌లో చూస్తు సరిపెట్టుకుంటున్నారు సోమా విజయ్ ప్రకాష్ దంపతులు. అయితే యూ ట్యూబ్ లైవ్ ద్వారా తమ కుమారుడి వివాహాన్ని ప్రపంచ వ్యాప్తంగా
ఉన్న బంధుమిత్రులు అందరూ చూడగలగడం ఆనందంగా ఉంది అంటున్నారు సోమా విజయ ప్రకాష్. కాగా కరోనా కష్టకాలంలో జరుగుతున్న ఈ ఖండాంతర ప్రేమ వివాహం పట్ల మీడియా ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ లైవ్ టేలిక్యాస్ట్కు సన్నాహాలు చేయటం విశేషం.













