బీజేపీలోనే కాక రేపుతున్న ‘ఈటల’ చేరిక వార్త

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిపోతున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో ఎలా వున్నా… బీజేపీలో మాత్రం కాక రాజేస్తోంది. ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎంట్రీ కావడంపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వస్తే బీజేపీలో మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తారని బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పెద్దిరెడ్డి నిలదీశారు. ఒక్కరు కూడా తనను సంప్రదించలేదని, తానూ అదే నియోజకవర్గానికి చెందిన నేతనని చెప్పుకొచ్చారు. ‘‘ఢిల్లీ నుంచి స్పెషల్ విమానంలో వచ్చారు. ఈటల వ్యవహారం నాతో చెబితే ఏమవుతుంది? ఈటలతో చర్చలు జరిపే సమయంలో నేను గుర్తుకు రాలేదా? నన్ను కాదని ఈటలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు? నేనూ ఆ నియోజకవర్గం నేతనే. నన్ను సంప్రదించాలి కదా’’ అని పెద్దిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జేపీ నడ్డా దృష్టికి ఈటల వ్యవహారం….
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పరిస్థితులు, ఇతర వ్యవహారాలపై చర్చించారు. ఇదే సందర్భంలో ఈటల వ్యవహారాన్ని నడ్డా దృష్టికి సంజయ్ తీసుకొచ్చారు. ‘‘ఈటలను బీజేపీలోకి తీసుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం.’’ అని బండి సంజయ్ నడ్డాతో తెలిపారు. ఈటల చేరికపై బండి సంజయ్ మాట్లాడుతూ… ‘‘ఈటల బీజేపీలో ఏ తేదీన చేరుతారన్నది రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. ఎప్పుడు రాజీనామా చేయాలి? ఎప్పుడు చేరాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.