నేరుగా అమెరికాకు విమానాలు
అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని డెట్రాయిట్, డల్లాస్ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను ఏర్పాటు చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానశాఖ మంత్రి అశోకగజపతిరాజుకు ఆయన ఒక లేఖ రాశారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాలు కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళిన రేవంత్ తన పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన పర్యటనలో డెట్రాయిట్, డల్లాస్ ప్రాంతాలలో నివసిస్తున్న వేలాది తెలుగు కుటుంబాలను తాను కలవడం జరిగిందన్నారు. ఎయిర్ ఇండియా అన్ని ప్రాంతాలకు సమర్థవంతంగా సేవలను అందిస్తున్నప్పటికీ తమ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి నేరుగా రావడానికి విమాన సర్వీసులు లేవని చెప్పారని తెలిపారు. ముఖ్యంగా వయోవృద్ధులు, పిల్లలతో ప్రయాణాలు చేయడం ఇబ్బందికరంగా మారిందని, దీనిని వారు తన దృష్టికి తీసుకువచ్చినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి డెట్రాయిట్, హైదరాబాద్ నుంచి డల్లాస్‌కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఆశోక్గజపతిరాజును కోరామని చెప్పారు. ఇందులో భాగంగానే లేఖను రాసినట్టు ఆయన తెలిపారు.













